ప్రజాశక్తి – సీతంపేట : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు న్యాయమైనవని, వాటిని వారిని పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు డిమాండ్ చేశారు. స్థానిక ఐటిడి వద్ద అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు చేపడుతున్న దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు ఐటిడిఎ పరిధిలో సుమారు 200 మంది గిరిజన గురుకులాల ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులను తొలగించి, ఆ పోస్టులను డిఎస్‌సిలో కలపాలని అనుకోవడం అన్యాయమని అన్నారు. 20ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించడం అంటే వారి జీవితాలను రోడ్డుపాలు చేయడమేనని చెప్పారు. గురుకులాల్లో విద్యార్థులకు విద్య అందిస్తూ, వారి ఆరోగ్య బాగోగులు చూస్తూ సేవలందించినా 8ఏళ్ల నుంచి జీతాలు పెరగని దయనీయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి పోస్టులను డీఎస్సీలో కలపరాదని, ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులందర్నీ సిఆర్‌టిలుగా విలీనం చేయాలని, 2022 పిఆర్‌సి ప్రకారం వారికి జీతాలు పెంచి కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వీరు చేస్తున్న పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు.
పార్వతీపురం : డిఎస్‌సి నుంచి తమ పోస్టులను మినహాయించాలని కోరుతూ 9రోజులుగా ఐటిడిఎ వద్ద దీక్షలు చేపడుతున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఎపి ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి జిల్లా కార్యదర్శి బివి రమణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15ఏళ్లుగా ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారిని రోడ్డున పడేయాలని చూడడం సరైంది కాదన్నారు. డిఎస్సీ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై గురుకులం రాష్ట్ర అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని పరిష్కారానికి కృషి చేయాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతమయ్యే పరిస్థితి నెలకొందని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు యూనియన్ నాయకులు దివాకర్, రమేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.అంతకు ముందు మహాత్మా జ్యోతి రావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
అవుట్ సోర్సింగ్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి : రాజన్నదొర
సాలూరు : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం టిడిపి ప్రభుత్వానికి ఉందని మాజీ డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర చెప్పారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో తాను గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడే అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల వేతనాల పెంపు, సిఆర్టీలుగా మార్పునకు సంబంధించిన ఫైలుపై సంతకం చేసి సిఎం జగన్ మోహన్ రెడ్డి కి నివేదించి నట్లు చెప్పారు. మంత్రిగా తాను చేసిన సిఫార్సులను అప్పుడు ఆ సంఘం నాయకులకూ చూపించానని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను సిఆర్టీలుగా మారుస్తామని, వేతనాలు పెంచుతామని టిడిపి కూటమి పార్టీలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. 15 ఏళ్లకు పైబడి పని చేస్తున్న వీరిని డిఎస్సీ పేరుతో ఇప్పుడు రోడ్డున పడేయాలని చూడడం తగదని అన్నారు. వీరి ఉద్యోగాలను డిఎస్సీ నుంచి మినహాయించి ఉద్యోగ భద్రత కల్పించాలని రాజన్నదొర కోరారు.
రాష్ట్ర ఎస్‌టి కమిషన్ చైర్మన్‌కు వినతి
పార్వతీపురం : తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు రాష్ట్ర ఎస్‌టి కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరావును గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ పోస్టులు డిఎస్‌సిలో కలిపారని, అదే జరిగితే ఉద్యోగం కోల్పోయి కుటుంబాలతో రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు ఇస్తున్నట్లు జీతాలు ఇచ్చి సిఆర్‌టిలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.