ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

May 15,2024 22:02

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మిని కలిసేందుకు వెళ్లి ఆమె అందుబాటులో లేకపోవడంతో ఎఒకు వినతిని అందజేశారు. జిల్లాలో పోలింగ్‌ను విజయవంతం చేసినప్పటికీ, విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందని తెలిపారు. ప్రధానంగా పిఒ, ఎపిఒలు ఈనెల 12,13,14 తేదీల్లో (మూడురోజులు) విధులు నిర్వహించినప్పటికీ రెండు రోజులకే రెమ్యునరేషన్‌ ఇచ్చారని పేర్కొన్నారు. మూడు రోజుల రెమ్యూనరేషన్‌తో పాటు, ట్రైనింగ్‌ రోజు కలిపి డ్యూటీ సర్టిఫికెట్‌ మంజూరు చేయాలని కోరారు. రిజర్వులో ఉన్న ఉద్యోగులకు రెమ్యునరేషన్‌ కొన్ని నియోజక వర్గాల్లో ఇవ్వలేదని, తక్షణమే వారికి రెమ్యునరేషన్‌తో పాటు సర్టిఫికేట్‌ ఇవ్వాలని కోరారు. అన్ని నియోజకవర్గాలకు రిసీవింగ్‌ సెంటర్‌ విజయనగరంలో పెట్టడం వల్ల చాలా ఇబ్బందుల గురయ్యారని, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులకు రిసెప్షన్‌ సెంటర్‌లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, సరైన భోజనాలు పెట్టలేదని, వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గజపతినగరం నియోజకవర్గంలో విధుల్లో ఉన్న పిఒపై కొంతమంది భౌతికదాడి చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాజాం నియోజకవర్గంలో అస్వస్థతకు గురైన ఉపాధ్యాడికి మెరుగైన చికిత్స నిమిత్తం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, అధ్యక్షులు రమేష్‌చంద్ర పట్నాయిక్‌, రాష్ట్ర నాయకులు డి.రాము, జిల్లా కార్యదర్శి రాంప్రసాద్‌, ఎస్‌టియు రాష్ట్రకార్యదర్శి డి.శ్యామ్‌, ఆపస్‌ రాష్ట్ర కార్యదర్శి ఇ.రామునాయుడు, జిల్లా కార్యదర్శి వెంకట నాయుడు పాల్గొన్నారు.

➡️