వికలాంగుల సమస్యలను పరిష్కరించాలి

Apr 5,2025 00:52

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ
ప్రజాశక్తి-గుంటూరు :
వికలాంగులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విలాంగుల సంఘాల నాయకులు కోరారు. శుక్రువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి వికలాంగుల(దివ్యాంగుల) కమిటీ మొదటి సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఏ.భార్గవ్‌ తేజ పాల్గొన్నారు. సమావేశంలో వికలాంగుల హక్కుల చట్టం 2016, వికలాంగుల సర్టిఫికెట్లు, యుడిఐడి కార్డుల జారీ, పేదరిక నిర్మూలన, వివిధ అభివద్ధి పథకాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో 5శాతం రిజర్వేషన్‌ అమలు, ప్రభుత్వ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో దుకాణాలు, స్టాళ్ల కేటాయింపు, వికలాంగులకు అవరోధ రహిత వాతావరణాన్ని అందించడం, వికలాంగుల గుర్తింపు, ఆన్‌లైన్‌ మోడ్‌ ద్వారా సహాయాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి పథకాలపై చర్చించారు. సధరన్‌ సర్టిఫికెట్లు జిజిహెచ్‌లో రీ-వెరిఫికేషన్‌ జరుగుతుందని స్లాట్‌ బుక్కింగ్‌ చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే యూడిఐడి కార్డులకు ఇబ్బందులు ఎదరవుతున్నాయని, సధరన్‌ సర్టిఫికేట్లు, యూడిఐడిలు వేర్వేరుగా ఇస్తున్నారని, రెండూ ఒకేదానిలో ఇస్తే బాగుంటుందన్నారు. 100 శాతం వినికిడి లోపం ఉన్న వారికి బస్‌పాస్‌లు ఇవ్వాలని కోరారు. వికలాంగుల ఉద్యోగాలలలో 5 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తే వికలాంగుల కుటుంబాలు బాగుంటాయన్నారు. మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో షాపులు కేటాయించాలని, ట్రై సైకిల్స్‌ మంజూరు చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలు మొదటి ఆంతస్తులో ఉన్నందున లిఫ్ట్‌, ర్యాంప్‌, వీల్‌ చైర్స్‌ వంటివి ఏర్పాటు చేయాలని కోరారు. గుంటూరు గాంధీ పార్క్‌లో వికలాంగులు లోనికి వెళ్ళేందుకు ర్యాంపులు లేవని, వీల్‌చైర్స్‌ కూడా లేవని ఏర్పాటు చేయాలని జెసిని కోరారు. అవసరమైన వారికి వీల్‌ చైర్స్‌, స్మార్ట్‌ స్టిక్స్‌, ట్రై సైకిల్స్‌ అందజేయాలని కోరారు. ప్రతి వికలాంగునికి రేషన్‌ కార్డు ఇప్పించాలని, ఒంటరి మహిళలకు పెన్షన్‌ అందించాలని, ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించాలని కోరారు. లోన్ల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను జేసీ దృష్టికి తెచ్చారు. సమావేశంలో వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి సువార్త, జెడ్పీ సిఇఒ జ్యోతి బసు, డిపిఒ బివిఎన్‌ సాయి కుమార్‌, డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.విజయలక్ష్మీ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️