గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న దీర్ఘ కాల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 17న నిర్వహించే చలో విజయవాడను జయప్రదం చేయాలని ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరామయ్య పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పిటిఎం పల్లిలో నిర్వహించిన పంచాయతీ కార్మికుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 8 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇఎస్‌ఐ, పిఎఫ్‌ చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికను రెగ్యులర్‌ లిస్ట్‌ ప్రపోజల్‌ నివేదిక ప్రభుత్వానికి సకాలంలో అందించాలని పేర్కొన్నారు. గౌరవ అధ్యక్షులు ఎ.రామాంజులు, ప్రధాన కార్యదర్శి ఎస్‌. సురేంద్ర బాబు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రీన్‌ అంబాసిడర్‌లకు కొన్ని పంచాయతీలకు పూర్తిగా చెల్లించలేదన్నారు. నాణ్యమైన పనిముట్లు, లీవులు అమలు చేయాలన్నారు. బ్యాంక్‌ల ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరారు. మేజర్‌ పంచాయతీలలో కనీస వేతనం రూ. 26 కోరారు. అనంతరం 17న చలో విజయవాడ కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు దేవరాయులు, ఎ.వి. రమణ, అంజి, మురళి, రెడ్డెయ్య, సుభద్ర, లక్ష్మిదేవి, గంగులు, శ్రీరాములు, కార్మికులు పాల్గొన్నారు.సుండుపల్లె : చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరామయ్య అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద మహాధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు రూ.26 వేలు జీతం ఇవ్వాలన్నారు. ప్రతి నెల 5వ తేదీనలోగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు, సహాయ కార్యదర్శి ఓబులేష్‌, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

➡️