ప్రజాశక్తి-గాజువాక : విశాఖ డెయిరీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం, సిఐటియు అనకాపల్లి జిల్లా కోశాధికారి వివి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖ డెయిరీ వద్ద డెయిరీలో పనిచేస్తున్న కార్మికుల చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్షలకు గురువారం వారు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. డెయిరీ కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైనదన్నారు. డెయిరీలో వస్తున్న లాభాలను కార్మికులకు, పాల ఉత్పత్తిదారులకు ఇవ్వకుండా కోట్లాది రూపాయలను పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. డెయిరీ సొమ్మును డెయిరీ యాజమాన్యం, పాలక సభ్యులు దోచుకొని ఆస్తులను పోగుజేసుకుంటున్నారని తెలిపారు. కార్మికులు, రైతులకు కోసం కట్టిన ఆసుపత్రిని కూడా ప్రైవేట్ సంస్థలకు లీజుకిచ్చారన్నారు. కంపెనీ యాక్ట్ ప్రకారం 20 సంవత్సరాలు దాటితే రావలసిన జీతాలు, పిఎఫ్, క్యాజువల్ లీవులు, బెనిఫిట్స్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. అదనపు పనికి ఓటీ, కనీస వేతన రూ.21 వేలు చెల్లించాలని, అగ్రిమెంట్ పద్ధతిలో ఉన్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, సంస్థ లాభనష్టాలతో సంబంధం లేకుండా బోనస్, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వ అమలు చేసిన వివిధ కేటగిరి ఉద్యోగుల వేతనం, ఇతర అలవెన్సులను విశాఖ డెయిరీ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, విచారణ పేరుతో తొలగించిన కార్మికులందరినీ తిరిగి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.