ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు దిలీప్ కుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, కోశాధికారి గొర్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక పాతబస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకూ ప్రదర్శన నిర్వహించి, అనంతరం కలెక్టరు ఎ.శ్యామ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, రూ.10వేలు వేతనహామీ నెరవేర్చాలని, జాబ్ చార్ట్ ప్రకటించాలని, బలవంతంగా రాజీనామా చేయించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ వాలంటీర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు బంకురు సూరిబాబు, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, వాలంటీర్ల సంఘ నాయకులు మహేష్, మధుసూదనరావు, బాలకృష్ణ, ఆదిలక్ష్మి, సుజాత, సురేష్, సింహాచలం, మోహనరావు, భూషనరావు, జిల్లా వాలంటీర్లు పాల్గొన్నారు.