ప్రజాశక్తి-విజయనగరంకోట : వివిధ పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సిసిటిఎన్‌ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్కు అండ్ సిస్టం)లో నిక్షిప్తం చేయాలని రాష్ట్ర పోలీసుశాఖ ఐజి పర్సనల్స్ ఎస్.హరికృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సిసిటిఎన్‌ఎన్ ద్వారా దర్యాప్తులో ఉన్న గ్రేప్ కేసులను సమీక్షించారు. భవిష్యత్తులో అన్ని రివ్యూ మీటింగులకు సంబంధించిన సమాచారాన్ని సి.సి.టి.ఎస్.ఎస్. ద్వారానే తీసుకొని, సమీక్షిస్తున్నా మన్నారు. కావున, ఎస్‌ఐలు, సిఐలు, డిఎస్‌పిలు దీనిపట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. సిసిటిఎన్‌ఎస్ వినియోగించడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకువస్తే, వాటిని సమీక్షించి, సమస్యలను ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లి తొలగించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎస్‌పి వకుల్‌జిందాల్ మాట్లాడుతూ పోలీసు స్టేషను పరిధిలో ఏదైనా నేరం నమోదైన పుడు సంబంధిత అధికారులు సంఘటనా స్థలంకు వీలైనంత తక్కువ సమయంలో చేరుకోవాలని, నేర స్థలంను క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌బందాలు తనిఖీ చేసి, కేసులను చేధించేందుకు అవసరమైన సాంకేతిక ఆధారాలను సేకరించాలని అధికారులనుఆదేశించారు. స్టేషను పరిధిలో ఉన్న ప్రముఖులు, దేవుళ్ళ విగ్రహాలపై నిఘా పెట్టాలని, విగ్రహాలపై ఆకతాయిలుదాడులు చేయకుండా స్థానికులతో విగ్రహాల రక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. లేడీస్ హాస్టల్స్ లో భద్రత ఏర్పాట్లును సంబంధిత పోలీసు అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. మిస్సింగు కేసుల్లో అలసత్వం వద్దని, ఫిర్యాదు అందిన వెంటనే కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలన్నారు. హిస్టరీషీట్లు కలిగిన వ్యక్తులు ప్రవర్తన, నడవడిక, నేర ప్రవత్తిపై నిఘా పెట్టాలన్నారు. మహిళలపై దాడులను నియంత్రిం చేందుకు ప్రారంభించిన శక్తి టీమ్స్ చురుగ్గా పనిచేయాలన్నారు. వివిధ పోలీసు స్టేషన్లులో దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ కేసుల్లో ప్రతిభ చూపిన అధికారులను, సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్‌పి పి.సౌమ్యలత, డిఎస్‌పిలు ఎం.శ్రీనివాసరావు, జి.భవ్యరెడ్డి, ఎస్. రాఘవులు, ఎం.వీరకుమార్, సిఐలు, వివిధ పోలీసు స్టేషన్ల ఎస్‌ఐలు పాల్గొన్నారు.
