పీలేరును ముంచెత్తిన వాన

ప్రజాశక్తి-పీలేరు పీలేరులో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గురువారం ఉదయం నుంచి తీవ్రంగా కాసిన ఎండకు కాస్త ఇబ్బంది పడ్డ పట్టణ ప్రజలు, మధ్యాహ్నం ఆకాశం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని వర్షాన్ని కురిపించింది. వాతావరణం కాస్తా చల్లబడ్డంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మండలంలో 26.2 మిల్లీల వర్షపాతం నమోదైంది. వర్షం నీరు కారణంగా ప్రధాన రహదారులు, ఆర్టీసీ బస్టాండ్‌, ఆర్టీసీ ప్లాట్‌ ఫామ్‌, వ్యాపార సముదాయాలన్నీ జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు, పాదాచారులకు, వ్యాపారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. బస్టాండ్‌లోని దుకాణాల వద్దకు నీరు చేరడంతో తమ వస్తువులు తడిపోతాయని వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. ఏ కొద్దిపాటి వర్షం కురిసినా ఆర్టీసీ బస్టాండ్‌లో భారీగా నీరు చేరి చెరువును తలపిస్తూ ప్రయాణికులకు, బస్సుల రాకపోకలకు అసౌకర్యాన్ని కలిగిస్తోంది. బస్టాండ్‌లోకి చేరే నీరు బయటకు పంపే మార్గాన్ని అన్వేషిస్తూ వ్యాపార సముదాయాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి తగిన స్పందన లేదంటూ ప్రయాణికులు, ప్రజలు, వ్యాపారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకొని బస్టాండ్‌ను ముంచెత్తే వర్షపు నీరు చొరబడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వర్షం పడిన ప్రతి సారీ బస్టాండ్‌లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

➡️