మండల్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలి

గుంటూరు: బిపి మండల్‌ కమిషన్‌ సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు అన్నారు. బిపి మండల్‌ 42వ వర్థంతి సందర్భంగా శనివారం స్థానిక గోరంట్ల వద్ద మండల్‌ విగ్రహానికి బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ 76 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో ఇప్పటికీ బిసిలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని, బిసిలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని అని, బిసి అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయట్లేదని చెప్పారు. ఇప్పటికైనా బిసిలకు జనాభా ప్రాతిపదికన సమస్త జీవన రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ బిపి మండల్‌ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో సామాజిక న్యాయం అందించి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరి క్రాంతికుమార్‌ మాట్లాడుతూ విద్య ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ల కోసం బిపి మండల్‌ కృషి చేసి, బిసిల అభివృద్ధికి దోహదం చేశారన్నారు. బిసిల వాటా కోసం మండల్‌-2 ఉద్యమం చేపడతామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.నాగమల్లేశ్వరరావు, నాయకులు కె.హనుమంతరావు, కె.వి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

➡️