ప్రజాశక్తి-పొదిలి: నూతన ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల పాలన పూర్తయినా జిల్లాలో ప్రధాన రహదారుల దుస్థితి అలాగే కొనసాగడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొదిలి- ఒంగోలు మార్గంలో రహదారి పరిస్థితి తీసికట్టుగా ఉంది. మర్రిచెట్లపాలెం-బూదవాడ-రామతీర్థం మధ్య రహదారి పరిస్థితి అధ్వానంగా ఉంది. బూదవాడ కంకర బిల్లుల వద్ద మోకాలి లోతు గుంతలు ఏర్పడి రహదారి మొత్తం చిధ్రం అయ్యింది. ఇక్కడ కంకర మిల్లుల నుంచి వస్తున్న వర్షపు నీరు ప్రధాన రహదారిపైకి చేరడంతో ఎక్కడ రోడ్డు ఉందో? ఎక్కడ గుంతలు ఉన్నాయో అర్థం కాక వాహన చోదకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపే ఈ ప్రధాన రహదారిలో నిత్యం వందలాది వాహనాలు, వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. గత ప్రభుత్వ తీరుతో విసిగి వేసారిన జిల్లా ప్రజలు కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే అధికారం లోకి వచ్చిన వెంటనే రహదారులను బాగుచేస్తామని ఇచ్చిన హామీని పాలక పెద్దలు మరిచారు. ఆర్టీసీ బస్సులు, ఇతర చిన్న చిన్న కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కొన్ని వాహనాలు గుంతల్లో పడి మరమ్మతు లకు గురవుతున్నాయి. మోకాలి లోతు నీటిలో ఆటోలు ఆగిపోతున్నాయి. మోటారు సైకిళ్ల సైలెన్సర్లు మునిగి పోతున్నాయి. మరికొందరు వాహన చోదకులు ఎక్కడ తమ వాహనాలు డ్యామేజ్ అవుతాయోనని అతి జాగ్రత్తగా వస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక ఆర్టీసీ డ్రైవర్ల పరిస్థితి ఇబ్బందిగా మారింది. తాము నడుపుతున్న వాహనాలు ఎక్కడ డ్యామేజ్ అవుతాయోనని తీవ్ర ఆందోళనతో ఉన్నారు. మోకాళ్ల లోతు గుంతలో బస్సుకు ఏ పక్క ఏ దెబ్బ తగిలినా, అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని డ్రైవర్ల దగ్గర ఆర్టీసి యాజమాన్యం రికవరీ చేస్తుండడంతో ఈ రోడ్లో ఎలా నడపాలో అని భయపడుతున్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు మూడు నెలల క్రితం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒకసారి స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ రహదారిని పరిశీలించారు. తక్షణ మరమ్మతులు చేయాలని ఆర్‌అండ్‌బి జిల్లా అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ప్రయాణికులు అంటున్నారు. మొక్కుబడిగా, తాత్కాలికంగా గుంతలు పూడ్చి అధికారులు మమ అనిపించారు. ఇటీవల తరచూ కురుస్తున్న భారీ వర్షాలతో మరలా అక్కడ గతంలో కంటే పెద్దవిగా గుంతలు పడ్డాయి. రహదారిపై నీరు చేరకుండా చర్యలు తీసుకోకపోవడంతో గత ఏడాది కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి బూదవాడ వద్ద ప్రధాన రహదారికి ఇరువైపులా కాలువలు తీయించి రహదారిని శుభ్రం చేయించాలని వాహన చోదకులు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
