కౌంటింగ్‌లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

May 27,2024 21:55

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ఓట్లను లెక్కింపు ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ అన్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే మైక్రో అబ్జర్వర్లకు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, మైక్రో అబ్జర్వర్ల విధులు, బాధ్యతలను వివరించారు. లెక్కింపు కేంద్రాల్లోని ప్రతీ టేబుల్‌ వద్దా మైక్రో అబ్జర్వర్లను నియమిస్తామన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత వీరిపై ఉందన్నారు. ఏమైనా తేడాలను గుర్తిస్తే వెంటనే పరిశీలకులు, రిటర్నింగ్‌ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, ఇతర లెక్కింపు సిబ్బంది ప్రతీ రౌండ్‌కు పోలైన ఓట్ల వివరాలను ఆర్‌ఒలకు అందజేస్తారని, ఇదే సమయంలో మైక్రో అబ్జర్వర్లు ఓట్ల వివరాలను అబ్జర్వర్లకు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. మొత్తం ప్రక్రియ అంతా సజావుగా, పారదర్శకంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా అబ్జర్వర్లపై ఉందన్నారు. లెక్కింపు ప్రక్రియలో ప్రతీ దశా కీలకమేనని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ సిబ్బందిని, ఏజెంట్లను కూడా గమనించాల్సిన బాధ్యత వీరిపై ఉందన్నారు. ఆర్‌ఒ టేబుల్‌ దగ్గర నియమితులయ్యే ఇద్దరు మైక్రో అబ్జర్వర్లపై, రౌండ్‌ వారీ ఓట్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించాల్సిన బాధ్యత ఉందన్నారు. నిబంధనల మేరకు సజావుగా కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి చేయడానికి మైక్రో అబ్జర్వర్లు కృషి చేయాలని కోరారు. ట్రైనింగ్‌ నోడల్‌ అధికారి సుధాకరరావు మాట్లాడుతూ, మైక్రో అబ్జర్వర్ల విధులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కౌంటింగ్‌లో తలెత్తే న్యాయపరమైన అంశాలు, కౌంటింగ్‌ కేంద్రం, దానిలో ఏర్పాటు చేసే టేబుళ్లు, ప్రతీ టేబుల్‌కు నియమితులయ్యే సిబ్బందీ, పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్ల పరిశీలన, నిరాకరణ, లెక్కింపు, ఇవిఎంలలో ఓట్ల లెక్కింపు, ఆ తరువాత చేపట్టాల్సిన చర్యలు, ఫలితాల ప్రకటన, పూర్తి చేయాల్సిన పత్రాలు తదితర అంశాలను వివరించారు. శిక్షణలో డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఎన్నికల సెల్‌ సూపరిటిండెంట్‌ ప్రభాకర్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️