ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం సమగ్ర అభివృద్ధి కోసం రూ .10 వేల కోట్లు కేటాయించాలని కోరుతూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 16న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన సంఘం చ్కెర్మన్, ఆర్‌డబ్ల్యుఎస్ రిటైర్డు ఎస్‌ఇ కె.శివానందకుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జివిపి జైపాల్ తెలిపారు. బుధవారం స్థానిక ఎల్‌బిజి భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో జ్యూట్, పంచదార, ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు మూత పడ్డాయని, రూ.50వేల మంది కార్మికుల బతుకులు పోయాయని తెలిపారు. జిల్లాలో నీటివనరులున్నా ప్రాజెక్టులు నిర్మించడం లేదన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో తగిన స్టాఫ్ లేరని, సౌకర్యాలు లేవని, కేన్సర్ టెస్టింగ్ సెంటర్, కార్డియక్ టెస్టింగ్ సెంటర్లు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు..జిల్లాలో 6 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉంటే 3 కళాశాలలకూ శాశ్వత భవనాలు లేవని, అన్ని విధాలా విజయనగరం అభివృద్ధి లో వెనుక బడి ఉందని అన్నారు. మామిడి, జీడి, చింత పండు, ప్రాసెసింగ్ పరిశ్రమలు పెట్టి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు నన్నారు. జ్యూట్ పరిశ్రమను బట్టల తయారీకి ఉపయోగించే పరిశ్రమగా మార్చాలాన్నారు. ఇటువంటి ఆలోచన ప్రభుత్వా లు చేసి విజయనగరం సమగ్ర అభివృద్ధి చెయ్యాలని కోరారు. ఇందుకోసం రూ.10వేల కోట్లు కేటాయించాలని కోరుతూ ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో అన్ని ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.శ్రీనివాసవాస, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకరరావు పాల్గొన్నారు.ఫోటో..విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆహ్వాన సంఘం నాయకులు దశ్యం.
