మాట్లాడుతున్న గుంటుపల్లి రజిని
ప్రజాశక్తి-సత్తెనపల్లి : మహిళలు నేటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారని, దాడులు, వివక్ష కొనసాగుతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజని ఆవేదన వెలిబుచ్చారు. పట్టణంలోని కొత్తపేటలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాలులను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పులిపాటి శివ అధ్యక్షత వహించారు. రజని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అయితే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు తప్పడం లేదని అన్నారు. వీటిని నియంత్రించేందు ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. మద్యంను ఆదాయవనరుగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి గాని దాని వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాని, ఆర్థికంగా చితికిపోతున్నాయని, జనం అనారోగ్యాలకు గురై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారనే విషయాలను విస్మరిస్తున్నాయని అన్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు సూపర్-6 పతకాలను ప్రకటించినా వాటిని అమలు మాత్రం చేయడం లేదన్నారు. ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె ఉమశ్రీ మాట్లాడుతూ హక్కులు కోసం ఎన్నో దశాబ్ధాల నుండి పోరాడుతున్నా మహిళ సమస్యల పట్ల మాత్రం పాలకులకు చిత్తశుద్ధి లేదని అన్నారు. చట్టాలు చేస్తున్నా వాటిని సరిగా అమలు చేయడం లేదని, సంచలనమైన కేసుల్లోనే స్పందిస్తున్నారని చెప్పారు. డ్వాక్రా గ్రూపుల్లో బ్యాంక్లలో పొదుపును తీసుకోనివ్వాలని, అభయ హస్తం డబ్బులు తిరిగిఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు డి.విమల మట్లాడారు. ఈ సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమములో సుధ, లక్ష్మి సునీత, కృష్ణవేణి, హైమావతి, రాజ్యలక్ష్మి, నవీన పాల్గొన్నారు.
