ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడని, ఆయన త్యాగం మరువలేనిదని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నగరంలోని జిల్లా కోర్టు సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి మంత్రి, ఇతర కూటమి నాయకులతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ … తెలుగువారికంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఆ ఆశయ సాధన కోసం మొట్టమొదటిగా నినందించి 1953వ సంవత్సరంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహా పురుషుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.దాదాపు 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన గొప్ప వ్యక్తి అని, ఆయన సాధించిన త్యాగ ఫలాలను ఈ రోజు తెలుగు వారందరూ అనుభవిస్తున్నారని, అటువంటి మహనీయుడిని తెలుగు ప్రజలందరూ గుర్తుపెట్టుకుని ఘనంగా నివాళులర్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కూటమి నాయకులు బండి రామకృష్ణ, కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య) తదితరులు పాల్గొన్నారు.
