ప్రజాశక్తి – శిరివెళ్ల (నంద్యాల) : మండల పరిధిలోని నల్లమల అడవిలో గల నంద్యాల గిద్దలూరు రహదారి ప్రక్కన వెలిసినటువంటి శ్రీ సర్వ నరసింహ స్వామి ఆలయ పరిసరాలలో శనివారం ఆలయ అధికారులు, సిబ్బంది స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల రాకపోకలతో పాటు వానర సైన్యం ఇతర వన జీవులు పరిసరాలను అపరిశుభ్రం చేస్తుండగా ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు స్వచ్ఛ దీవస్ స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని భక్తులకు సూచించడం జరిగిందన్నారు. ఆలయ అధికారి నరసయ్య సిబ్బంది సీవీ రమణ మాట్లాడుతూ ఆధ్యాత్మిక వైభవంతో విరాజిల్లుతున్న సర్వ నరసింహస్వామి ఆలయం భక్తులు కల్మషం లేని హృదయంతో ప్రార్థిస్తూ కోరిన కోర్కెలు తీర్చుతూ కొంగుబంగారమై దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆలయం సర్వ నరసింహస్వామి ఆలయం అని అన్నారు. నల్లమల అడవిలో ఉన్నప్పటికీ భక్త జన సందర్శన నిత్యం ఉంటుందని అన్నారు. ప్రతిరోజు స్వామివారికి ధూప దీప నైవేద్యం తో పాటు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇఓ నరసయ్య పేర్కొన్నారు. కల్మషం లేని హృదయంతో దైవాన్ని ఎలా ప్రార్థిస్తామో అలాగే పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత శుభ్రత సైతం భక్తాదులకు అతి ముఖ్యమైనదని ఈ సందర్భంగా సీవి రమణ తెలియజేశారు.
