ఆంధ్రా ఉద్యమానికి బాపట్లలోనే బీజం

ప్రజాశక్తి బాపట్ల: ఆంధ్రా ఉద్యమానికి బాపట్లలోనే బీజం పడిందని జిల్లా అడిషనల్‌ ఎస్పీ పి.వి.విఠలేశ్వర్‌ అన్నారు. మంగళవారం రాష్ట్ర 71వ అవతరణ దినోత్సవ సంద ర్భంగా ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల ఆధ్వ ర్యంలో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విఠలేశ్వర్‌ మాట్లాడుతూ ఆంధ్రుల స్వరాష్ట్ర వాంఛకు ఇక్కడే బీజం పడిందన్నారు. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ నాలుగు దశాబ్దాల ఆంధ్రోద్యమానికి నాంది పలికిందని తెలిపారు. తెలుగువారి ఐక్యతకు అది వూతమిచ్చిందన్నారు. టౌన్‌ హాల్‌ లో జరిగిన మహాసభలు భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకు శ్రీకారం చుట్టాయన్నా రు. ఈ కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి పిసి సాయిబాబు మాట్లాడుతూ బాపట్ల సభలు ఆంధ్రరాష్ట్ర అవతరణకు పునాదిగా నిలిచాయన్నారు. అంధ్ర విశ్వవిద్యా లయ స్థాపనకు కూడా ఇక్కడే బీజం పడిందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంతో ఆంధ్ర రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. బాపట్ల ప్రాంతానికి చెందిన సమరయోధులు స్వామి సీతారాం ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ఏ వి రమణారావు, అధ్యాపకులు కలాం, పౌర సమాఖ్య నాయకులు కె.విజయకుమార్‌, రమణ కుమార్‌, యు.వి.రామారావు, గుండ్రెడ్డి సత్యనారాయణ, రచయిత్రి చిల్లర భవానీ దేవి, మానం అప్పారావు, ఏవివి హై స్కూల్‌ హెచ్‌ఎం ఎడ్ల సత్యవతి, కరణం రవీంద్రబాబు, సత్యనారాయణ రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️