ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్: నిత్యం 300 మందికి అన్నం పెట్టి కడుపు నింపుతున్న శివం ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయని, నిర్వాహకులు గొల్లపూడి శ్రీహరి అభినందనీయుడని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ తెలిపారు. స్థానిక సంతపేటలోని శివం నిత్య అన్నదాన క్షేత్రం ప్రారంభించి మూడేళ్ళు అయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కేక్ కట్ చేసి అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా శివం శరణాలయంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివం శరణాలయంలోని వద్ధులకు ఆశ్రయం కల్పించి మూడు పూటలా భోజనం పెట్టి వాళ్ల బాగోగులు చూస్తున్నారన్నారు. ఒంగోలు నగరంలో శివం నిత్య అన్నదాన వాహనం ద్వారా అనాధలు, యాచకులు, పేదలకు ప్రతిరోజు 300 మందికి అన్నం పెట్టి కడుపు నింపడం మానవత్వంతో కూడిన గొప్ప సేవా కార్యక్రమమన్నారు, ఈ శివం శరణాలయానికి ప్రభుత్వం తరఫున సొంత స్థలం ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్త మండవ మురళీకష్ణ మాట్లాడుతూ శివం ఫౌండేషన్ ద్వారా పేదలకు అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ శరణాలయానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఒంగోలు నగర అభివద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ ధనవంతులు దాతృత్వంతో మీ కుటుంబాలలో పుట్టినరోజులు పెళ్లిరోజులు ముఖ్యమైన రోజుల్లో శివ శరణాలయంలో జరుపుకుని పేదలకు ఆర్థికంగా అండగా ఉండాలని తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ తెలుగు మహిళ కార్యదర్శి మండవ లావణ్య మాట్లాడుతూ అన్ని దానాలలలో అన్నదానం మిన్న అని, రెండు సంవత్సరాలకు పైగా ప్రతిరోజు క్రమం తప్పకుండా పేదలకు అన్నం పెట్టి కడుపు నింపుడం గొప్ప సేవా కార్యక్రమాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావును శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మండవ సుబ్బారావు, కోసూరి శ్రీదేవి, వడ్డెంపూడి సుజాత, చిక్కాల కిరణ్ కుమార్, డి శ్రీనివాస్. భాస్కర్ రావు, జెమినీ శ్రీనివాస్ దివ్య పాల్గొన్నారు.
