ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కు కార్మిక నాయకులకు స్థానిక స్టీల్ యాజమాన్యం ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణం ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్టు కార్మికుల తొలగింపు తక్షణం ఆపాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్టీల్‌ప్లాంట్‌లో వివిధ విభాగాల ఎదుట ధర్నా నిర్వహించి విభాగాధిపతులకు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ కెఎస్‌ఎన్.రావు, కో-కన్వీనర్ రమణమూర్తి, జె.అయోధ్యరామ్, పి.శ్రీనివాసరాజు, వైటి.దాస్, యు.రామస్వామి మాట్లాడుతూ, యాజమాన్యం సుమారు ఆరు నెలలుగా సకాలంలో జీతాలు చెల్లించకుండా స్టీల్ కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. సుమారు 6000 మంది కార్మికులకు హెచ్‌ఆర్‌ఎ నిలుపుదల చేయడం, ఉక్కు నగరంలో నివసిస్తున్న కార్మికులకు కరెంటు చార్జీలు యూనిట్‌కు ఎనిమిది రూపాయల చొప్పున పెంచడం, కార్మిక హక్కులపై నిరంకుశ వైఖరిని ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమన్నారు. ఒకపక్క ప్రభుత్వం పూర్తిస్థాయి ఉత్పత్తి చేయాలని చెబుతూనే 1130 మందిని విఆర్‌ఎస్ పేరుతో ఇంటికి పంపుతోందని తెలిపారు. ఇదే సమయంలో సుమారు 6000 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగించే విధంగా చర్యలు చేపట్టారని చెప్పారు. వీటి గురించి అడిగిన కార్మిక నేతలకు నిరంకుశంగా షోకాజ్ నోటీసులను ఇచ్చి కట్టడి చేయాలని భ్రమించడం అవివేకమని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తును అంధకారం చేసిన యాజమాన్య వైఖరికి నిరసనగా సమ్మె నోటీసు ఇచ్చారని గుర్తు చేశారు. రీజనల్ లేబర్ కమిషనర్ సమక్షంలో నేడు జరుగుతున్న చర్చలు విఫలమైతే వారు చేసే పోరాటానికి పూర్తి మద్దతు అందిస్తామని, ఐక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టీల్ అఖిల పక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు జె.రామకృష్ణ, సుబ్బయ్య, టివికె.రాజు, నీలకంఠం, పుల్లారావు, మరిడయ్య, వి.ప్రసాద్, విడివి.పూర్ణచంద్రరావు, నాగబాబు, దాసరి రవి, మహాలక్ష్మినాయుడు, రామ్‌కుమార్ తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్షకార్యదర్శులు, కాంట్రాక్టు కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.
