ప్రజాశక్తి – కడప రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ భావనను ప్రతి ఒక్క పౌరుడూ కొనసాగించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సభా భవన్ హాలులో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ హాజరై ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలోని భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్బంగా సభాభవన్‌లో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ 2015 ముందు ప్రతి సంవత్సరం నవంబర్ 26 న జాతీయ న్యాయ దినోత్సవం నిర్వహించుకునేవారమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం పిలుపునిచ్చిందన్నారు. బ్రిటిష్ పాలనలో ఆనాటి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని మన దేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ రచన సభ్యులు భారత రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఇందులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముఖ్య భూమిక పోషించారని అన్నారు. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు దేశంలో ఎన్నో వైవిధ్యతలు వచ్చినప్పటికీ సుస్థిర రాజ్యాన్ని కొనసాగించడంలో మన దేశ రాజ్యాంగం ప్రముఖ పాత్ర పోషించింది అన్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఎదిగిందని రాబోవు కాలంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించడానికి మొత్తం రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టిందన్నారు. 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించుకున్న రాజ్యాంగం 1950 నుండి అమలులోకి వచ్చిందని తెలిపారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ హక్కులు ప్రసాదించిందని, అందరూ సమానంగా జీవించే హక్కు ఇచ్చిందని అన్నారు. అనంతరం భారత రాజ్యాంగ ప్రవేశిక లోని న్యాయ చట్టాల పరిరక్షణకు తమ వంతు కషి చేస్తామని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ విశ్వేశ్వర్ నాయుడు, కడప ఆర్‌డిఒ జాన్ ఇర్విన్, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి నాగేశ్వరరావు, డిఆర్‌డిఎ పీడీ ఆనంద్ నాయక్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి రాజ్యలక్ష్మి,కలెక్టరేట్ ఏవో విజరు కుమార్, కలెక్టరేట్లోని అన్ని విభాగాల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.