కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర 7వ మహాసభ ఈనెల 20, 21 తేదీల్లో ఎన్‌టిఆర్ జిల్లా, కొండపల్లిలో నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర కోశాధికారి వి.వెంకటేశ్వరరావు తెలిపారు. మహాసభ కరపత్రాలను స్థానిక కృష్ణనగర్ పార్క్ వద్ద సంఘ నాయకులు గురువారం ఆవిష్కరించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 20న మధ్యాహ్నం 3 గంటలకు కొండపల్లి పోస్టాఫీసు సెంటర్ నుండి ప్రదర్శన, అనంతరం విటిపిఎస్ వారి బి కాలనీ గ్రౌండ్‌లో బహిరంగ సభ ఉంటుందన్నారు. బహిరంగ సభలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.భాస్కరయ్య, ఆహ్వాన సంఘ కమిటీ అధ్యక్షులు సిహెచ్.వెంకటరెడ్డయ్య, గౌరవాధ్యక్షులు బి.శ్రీకాంత్ ప్రసంగిస్తారని తెలిపారు. ర్యాలీ, బహిరంగ సభలో రజక వృత్తిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. బహిరంగ సభ అనంతరం 21న ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లోని ముత్తవరపు స్వర్ణాదేవి వెంకటేశ్వరావు ఆడిటోరియంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ప్రతినిధులతో సభ ఉంటుందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జా సుబ్బారావు తెలిపారు. రజకవృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో సమగ్రంగా చర్చించుకొని భవిష్యత్ కర్తవ్యాలు నిర్దేశించుకోనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం.వెంకటనరసయ్య, జిల్లా కోశాధికారి వి.చిన్న కొండయ్య, సీతయ్య, ఎస్.శ్రీనివాసరావు, భాస్కరరావు, ఎల్.శ్రీను, ఆంజనేయులు పాల్గొన్నారు.
