రాయదుర్గం (అనంతపురం) : తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు ఏర్పాటుకు నిర్మాణం పనులు మొదలుపెట్టినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మంగళవారం ఆయన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తదితరులతోపాటు తుంగభద్ర ప్రాజెక్టు వద్ద గేటు ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. తుంగభద్ర బోర్డు ఇంజనీరింగ్ నిపుణులతో పరిస్థితిని చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ … నిపుణుల సూచన మేరకు 20ఐ5 అడుగుల కొలతలు చొప్పున నాలుగు భాగాలుగా గేటును తయారు చేసేందుకు మూడు సంస్థలకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. ఇంజనీరింగ్ నిపుణులు, సిడబ్ల్యుసి అధికారుల సూచనల మేరకు రిజర్వాయర్లో నీటి నిల్వ పరిస్థితిని అంచనా వేసి దశలవారీగా ఒకదానిపై ఒకటి నాలుగు గేట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన గేట్లను రూపొందించే చర్యలను చేపట్టినట్లు తెలిపారు. గేటు ఏర్పాటుకు రిజర్వాయర్లో నీటి నిల్వ సామర్థ్యం గరిష్టంగా ఉంచేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నట్టు చెప్పారు. రాయలసీమ జిల్లాలు, కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కర్ణాటక ప్రాంత జిల్లాలకు వరప్రదాయని అయిన తుంగభద్ర రిజర్వాయర్ ఈసారి నిండుకుండలా ఉండటంతో ఈ ప్రాంత రైతులు ఈసారి పంట దిగుబడి పై ఆశలు పెట్టుకున్నట్లు చెప్పారు. ఈసారి వేసవిలో కూడా తాగునీటి ఎద్దడి ఈ ప్రాంతంలో ఉండదని భావించారన్నారు అయితే 70 సంవత్సరాల పాతదైన తుంగభద్ర ప్రాజెక్టు గేటు ఊహించని స్థితిలో కొట్టుకుపోవడం విచారకరం అన్నారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని రిజర్వాయర్ కోల్పోతోందన్నారు. నీటి నష్టం కంటే ఈ ప్రాంతంలో రైతులు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యవసాయంపై పెట్టారన్నారు. నిపుణుల సూచన మేరకు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీటిమట్టం ఉంటే గేటును ఏర్పాటు చేయవచ్చు అని వారి సూచన మేరకు గేటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు కూడా తుంగభద్ర బోర్డు అధికారులు, నిపుణులతో సమన్వయంగా సహకరిస్తున్నట్లు తెలిపారు. త్వరితగతిన గేటు ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు ఏర్పాటుకు చర్యలు ప్రారంభం
