అనకాపల్లి : స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా … ఆదివాసీల గ్రామాల్లో ఇంకా కరెంటు లేదని ఎంతోకాలంగా సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు ఫలించాయి. ఆదివాసీ గ్రామాలు కరెంటు వెలుగులతో ఆనందాన్ని నింపుకున్నాయి. ఇన్నాళ్లకు కరెంటు వచ్చిందన్న ఆనందంతో ఆ గ్రామస్తులంతా రాత్రంతా నిద్రపోకుండా ఆడిపాడి సంతోషాన్ని తెలిపారు. సోమవారం సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు మాట్లాడుతూ వివరాలను తెలిపారు. ఇన్నాళ్లూ అంధకారంలో మగ్గిపోయిన తమ గ్రామానికి విద్యుత్ సరఫరా రావడంతో అక్కడి ఆదివాసీలంతా ఆడిపాడారు. ఆ విద్యుత్ వెలుగుల్లోనే ‘థింసా’ ఆడి సంబరాలు చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కొండ శిఖర గ్రామమైన నీలబంధ పీవీటీజీ గ్రామస్తులకు ఇన్నాళ్లకు విద్యుత్ సరఫరా లభించింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి నేటికి 77 ఏళ్లవుతున్నా తమ గ్రామానికి కరెంటు సౌకర్యం లేదంటూ వారంతా చాలాసార్లు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. సిపిఎం ఆధ్వర్యంలో కాగడాలతోనూ ఆందోళనకు దిగారు. ఈ విషయమై పత్రికల్లోనూ విస్తృతంగా కథనాలొచ్చాయి. ఈ కారణంగానే తమ గ్రామానికి విద్యుత్ వెలుగులు ప్రసరించాయని, అందరికీ అభినందనలు చెబుతూ రాత్రంతా థింసా నృత్యాలతో ఆనందోత్సవాలు జరుపుకొన్నామని గెమ్మిలి చిన్న, గెమ్మిల అప్పారావు తదితరులు చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేశారు. సిపిఎం కృషి ఫలితంగా…. కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
