ప్రజాశక్తి – సామర్లకోట (కాకినాడ) : యాజమాన్యం తమ సమస్యను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని రాక్ సిరామిక్ కార్మికులు స్పష్టం చేశారు. అక్రమ తొలగింపులకు నిరసనగా … రాక్ సిరామిక్స్ గేటు ముందు ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో రాక్ సిరామిక్స్ కార్మికులు నిరసన కొనసాగించారు. ఈ సందర్బంగా కార్మికులు గంగాధర్ మాట్లాడుతూ … కార్మికులను విధుల నుండి తొలగించి 104 రోజులు చేరుకుందని, పోరాటం ప్రారంభించి 40 రోజులు అయ్యిందని అన్నారు. కార్మికులను అక్రమంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయం అన్నారు. 5 సార్లు జాయింట్ లేబర్ కమిషనర్ వద్ద చర్చలు జరిగినా యాజమాన్యం మంకుపట్టుదలతో వ్యవహరిస్తుందన్నారు. కార్మిక చట్టాలను పాటించకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కి కూడా కంపెనీ యాజమాన్యం అబద్ధాలు చెబుతున్నదని ఆరోపించారు. రాక్ సిరామిక్స్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికులను వేధిస్తుందన్నారు. కార్మికుల రక్తమాంసాలు పిండుకొని లాభాలు గడించిన కంపెనీ అదే కార్మికులను తొలగించడం దారుణమన్నారు. స్ధానికులకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాలు ఒకపక్క తీర్మానం చేస్తుందని కానీ ఇక్కడ కంపెనీ మాత్రం విధుల నుండి తొలగిస్తుందన్నారు. తక్షణం ప్రజాప్రతినిధులు స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. యాజమాన్యం ఎన్ని అడ్డంకులు పెట్టినా ధర్నా ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యం మొండివైఖరి నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు చంద్రశేఖర్, గంగాధర్, సతీష్, రామకృష్ణ, వరప్రసాద్, మల్లికార్జునరావు, గంగాధర్, క్రాంతి, మంగారావు,అర్జున్ రావు, మూర్తి, సత్యనారాయణ, చంద్రన్న, ప్రభుదాస్, రామచంద్రయ్య, రాజబాబు, సతీష్ కుమార్, శివ నారాయణ, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
సమస్యను పరిష్కరించే వరకు పోరాటం ఆగదు : రాక్ సిరామిక్ కార్మికులు
