ఇథనాల్ ప్లాంట్ 120 కెవిపిడిగా మార్చడంతో రైతులు, కార్మికుల్లో ఆందోళన
చెరకు రైతులకు క్లారిటీ ఇవ్వని యాజమాన్యం
చెరకు సాగుపై రైతులు దిగులు
ప్రజాశక్తి-రేగిడి : విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఏకైక చక్కర కర్మాగారం సంకిలి ఇఐడి ప్యారి సుగర్ ఫ్యాక్టరీ ఉనికిపై రైతుల్లో ఆందోళన వ్యకమవుతోంది. ఈ ఫ్యాక్టరీకి అనుబంధ కర్మాగారంగా ఇథనాలు ప్లాంట్ నిర్మించడంతో త్వరలో ఈ ఫ్యాక్టరీ బీర్లు తయారీ పరిశ్రమంగా మారనుందా అనే అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోంది. అదే జరిగితే విజయనగరం జిల్లాలో సుగర్ ఫ్యాక్టరీలు పూర్తిగా కనుమరుగైనట్లే. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెరకు రైతులకు సంకిలిలోని ఇఐడి ప్యారి సుగర్ ఫ్యాక్టరీయే దిక్కుగా ఉంది. ఇప్పటికే విజయనగరం జిల్లాలోని ఎన్‌సిఎస్ సుగర్స్, భీమసింగి సుగర్ ఫ్యాక్టరీలు ప్రభుత్వ విధానాల కారణంగా మూతపడ్డాయి. ఈ రెండు జిల్లాల్లో సుమారు 32 వేల మంది చెరకు రైతులు చెరకు సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 12 వేల మంది రైతులు నాన్ అగ్రిమెంట్ ద్వారా సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి చెరకును లారీలు , ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తుండేవారు. గత రెండేళ్ల నుంచి ఈ రెండు జిల్లాల్లో సుగర్స్ యాజమాన్యం చెరకు సాగుపై డివిజన్ల వారీగా శాస్త్రవేత్తలతో రైతులకు దిగుబడులపై అవగాహన కల్పించడం, రాయితీలు, నూతన వంగడాలు వంటి వాటిపై పట్టించు కోకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గతంలో 48 కెఎల్‌పిడితో ఆల్కహాల్ కు సంబంధించిన స్పిరిట్‌ను ఈ ఫ్యాక్టరీ ఎగుమతి చేసేది. ఇటీవల ఆ ఇథనాలు ప్లాంటును రోజుకు 120 కిలోలీటర్లు (కెఎల్‌పిడి)గా పెంపుదల చేస్తూ నడుపుతున్నారు. వీటికి వాస్తవంగా షుగర్ మలాస్ రా మెటీరియల్‌ను వాడుతారు. ప్రస్తుతం మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి ఆల్కహాల్ స్పిరిట్‌గా మారుస్తున్నారు. యాజమాన్యం చెరకు పంటలు వద్దని, మొక్కజొన్న పంటలు మేలని రైతులకు చెప్పడంతో రైతుల్లో ఆందోళన వ్యకతమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు చెరకు పంటలు వేయలా.. వద్దా అనే అయోమయంలో పడ్డారు. వాస్తవానికి మురుగప్ప సంస్థ చెరుకు రైతులకు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ రెండు జిల్లాల రైతులు చెరుకు సాగు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. గత ఏడాది ఉన్న మమ్ము తోటలు, మొక్క తోటలు కలిపి 11 ఎకరాలు వేసినట్లు యాజమాన్యం కాకి లెక్కలు చెబుతున్నారు. వీటి సరాసరి దిగుబడి 2.10 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా. 2026 క్రషింగ్ సీజన్‌కు సగానికి పైగా చెరుకు ఉందని రైతులే చెప్తున్నారు. ఇటీవల మురగప్ప సంస్థ యాజమాన్యం సంకిలి ప్యారి సుగర్స్ కు వచ్చి స్థానిక యాజమాన్యంతో చర్చించారు. పర్మినెంట్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కలిపి 122 మందిని ఎటువంటి నోటీసులు లేకుండా తొలగించడం పట్ల కర్మాగారం మూసివేతకు ఇదే తార్కాణమని కార్మికులు అంటున్నారు. మరి కొంతమంది ఉద్యోగులను పొమ్మనలేక పొగ పెడుతున్నట్లు చెన్నై కు బదిలీ చేస్తున్నట్లు తెలిసింది. ముందుగా మూడునెలల జీతం ఇచ్చి మరీ తొలగించడం అన్యాయమని పర్మినెంట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మిగిలిన వారిని కూడా రెండో లిస్టులో తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. 2026 నాటికి ఉన్న కొద్దిపాటి చెరకు క్రషింగ్ చేసి కార్మికుల వంతు వస్తుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి సెటిల్మెంట్ చేసే ఆలోచనలో యాజమాన్యం చూస్తుందని కార్మికులు తెలిపారు. కర్మగారంలో పనిచేసిన వారిని అర్ధాంతరంగా తొలగిస్తే 50 ఏళ్లు దాటిన కర్మాగార ఉద్యోగులు, కార్మికులు తమ కుటుంబాలతో వీధిన పడే ప్రమాదం ఉంది. ఈనేపథ్యంలోనే మురగప్ప సంస్థ యాజమాన్యం కర్మగార పరిస్థితులపై కొలంబాలో హెచ్‌ఒడిలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో ఫ్యాక్టరీ మూతపడుతుందా, లేకా బీర్లు పరిశ్రమగా మారుతుందా అనే అనుమానాలు వ్యకమతువుతున్నాయి.