ప్రజాశక్తి-గోపాలపట్నం : ఎన్‌ఎడిలో సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికుల సస్పెన్షన్‌ను తక్షణమే రద్దుచేయాలని డిఫెన్స్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రెడ్డి వెంకటరావు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ఎన్‌ఎడి గేటు వద్ద గురువారం సాయంత్రం కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా రెడ్డి వెంకటరావు మాట్లాడుతూ, ఎన్‌ఎడిలో సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులపై పోలీసులు కేసులు పెట్టడంతో పాటు 36 మందిని యాజమాన్యం నవంబర్ 22న సస్పెండ్ చేసిందని, ఇది పచ్చి దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ఎన్‌ఎడిలో కార్మికులు చేసిన ఓటిని ఇవ్వనని సిజిఎం మొండికేసి సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎన్‌ఎడిలో కింద స్థాయి అధికారుల నుంచి జనరల్ మేనజర్ వరకు గత 30 సంవత్సరాలుగా వస్తున్న అనవాయితీని కొనసాగించమని చెప్పినా, యూనియన్లు విజ్ఞప్తి చేసినా సిజిఎం నిరాకరించారని తెలిపారు. ఒక పక్క పాత ఓటీని ఫ్యాక్టరీ యాక్ట్ పేరుచెప్పి ఇచ్చుటకు నిరాకరిస్తునే, ఆ చట్టానికి భిన్నంగా రాత్రి 8 గంటల తరువాత శని, ఆదివారంలో ఓటీ చేయమని సిజిఎం ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సిజిఎం మహిళలతో ఆసభ్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఓటీపై తన వైఖరి నేరుగా కార్మికులకే చెప్తానని పిలిచి ఆఫీసులోనికి వచ్చిన వారందరి ఫొటోలు తీసి 36 మందిని సస్పెండ్ చేయడం కార్మిక చరిత్రలోనే ఇదే మొదటిసారన్నారు. కార్మికులను ఇక్కట్లు పాల్జేస్తున్న సిజిఎంపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో సిఇ యూనియన్ గౌరవాధ్యక్షులు ఎవి.థామస్, అధ్యక్షుడు నూకరాజు, కార్యదర్శి శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.