ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యలో బడి మానేసే విద్యార్థుల సంఖ్యను తగ్గించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచకపోవటం వల్ల ఆహారంలో నాణ్యత తగ్గిపోతుంది. పొమ్మనకుండా పొగబె డుతున్న చందంగా ప్రభుత్వాల వ్యవహార శైలి ఉంది. సన్నబియ్యం సరఫరా హామీ అమలు కావట్లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచకపో వటంతోపాటు కార్మికుల వేతనాలు, బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. వీటికి తోడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ వేధింపులు అధికం అవుతున్నాయి. గుంటూరు జిల్లాలో 2117 మంది మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పని చేస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో అక్షయపాత్ర, తెనాలిలో ఇస్కాన్ వారు పథకాన్ని నిర్వహిస్తున్నారు. ఆయా సంస్థలు కోడిగుడ్డును వండి పెట్టట్లేదు. ప్రభుత్వాలు మారినప్పుడు వారి మార్క్ చూపించు కోవటానికి కొత్త మెనూ ప్రకటిస్తున్నారు. కానీ అందుకు అనుగుణంగా మెనూ ఛార్జీలు మాత్రం పెంచట్లేదు. నాణ్యత లేకపోవటం వల్ల మధ్యాహ్న భోజనం తీసుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. రికార్డుల్లో భోజనం చేసే వారి సంఖ్య బాగున్నా వాస్తవ పరిస్థితుల్లో సగం మంది కూడా తినట్లేదు. నాణ్యత లేకపోవటమే ఇందుకు కారణమని తల్లిదండ్రులు అంటున్నారు. రోడ్డుపక్కన బండిలో ఇడ్లీ తినాలన్నా రూ.20 కావాలి. కానీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి ఇస్తుంది మాత్రం రూ.10 లోపే. ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.6.19, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.9.29 ఇస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నవంబర్‌లో మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులు చేసి, హైస్కూల్ విద్యార్థులకు రూ.48పైసలు, ఎలిమెంటరీ విద్యార్థులకు రూ.32 పైసులు బడ్జెట్ పెంచారు. అయితే పెంచిన బడ్జెట్ ఐదు నెలలు కావస్తున్నా ఇంత వరకూ అమలు చేయలేదు. పెరిగిన భారం ఇప్పటికే కార్మికులు భరిస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలో కార్మికుల జీతాలు నాలుగు నెలలుగా, బిల్లులు మూడు నెలలుగా పెండింగ్ ఉన్నాయి. ఇచ్చే రూ.3వేల జీతం కూడా సకాలంలో ఇవ్వట్లేదని కార్మికులు వాపోతున్నారు. జీతాలు, బిల్లులు సకాలంలో ఇవ్వక, బడ్జెట్ పెంచకపోవటంతో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరిగిపోయి నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. అప్పులు పెరిగిపోతున్నాయని, వడ్డీలకు తెచ్చి ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కోడిగుడ్డు ఉడికిస్తే విద్యార్థులు తినట్లేదని ఫ్రై చేసి పెట్టాలని గతనెల రోజులుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే అందుకు అవసరమైన ఆయిల్, ఉల్లిపాయిలు, ఇతర సరుకులకు మాత్రం బడ్జెట్ కేటాయించలేదు. మెనూలో జావ ఇవ్వాలని చెబుతున్నారు. దానికీ బడ్జెట్ పెంచలేదు. ఈ అదనపు భారాలను కార్మికులే భరిస్తున్నారు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు, తొలగింపులు పెరిగాయి. 9నెలల్లో దాదాపు 122 మందిని మధ్యాహ్న భోజన కార్మికుల్ని తొలగించారు. ఈ నేపథ్యంలో వేతనాలు, బడ్జెట్ పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి ఈనెల 18న ఛలో విజయవాడ కార్యక్రమం తలపెట్టారు.పథకానికి బడ్జెట్ పెంచాలని, జోనల్ వారీగా మెనూ రద్దు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మెనూ అమలు చేయాలని, ధరల పెరుగులదలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు కనీసం రూ.20లకు పెంచాలని, ప్రతి నెలా 5వ తేదీలోగా వేతనాలు, బిల్లులు జమ చేయాలని, ప్రైవేటు సంస్థలకు పథకాన్ని అప్పగించొద్దని, రాజకీయ వేధింపులు ఆపాలని తదితర డిమాండ్లతో ధర్నా చేపట్టారు.
బడ్జెట్ పెంచాలిదండా లక్ష్మీనారాయణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు
ప్రభుత్వానికి పేద విద్యార్థుల పట్ల చిత్తశుద్ది ఉంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పథకానికి బడ్జెట్ పెంచాలి. నాణ్యమైన ఆహారం అందించటానికి ప్రతి విద్యార్థికి కనీసం రూ.20 కేటాయించాలి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవటంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారు. సకాలంలో బిల్లులు వేతనాలు ఇవ్వాలి. కార్మికులకు కనీసం రూ.10వేలు జీతం ఇవ్వాలి. ముఖ్యంగా జిల్లాలో రాజకీయ వేధింపులు మానుకోవాలి. తమ వారిని నియమించుకునేందుకు ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని తొలగించటం సరికాదు.
