పన్నువృద్ధి రేటు మరింత పెంచాలి

Jan 8,2025 21:21

వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ హరినారాయణ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రెవెన్యూ వసూళ్ల లక్ష్యాలను అధిగమించిన నేపథ్యంలో విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లనయ్యకు కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ హరి నారాయణ అభినందించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలపై సిడియంఎ సమీక్ష నిర్వహించారు. ముందుగా రెవెన్యూ వసూళ్ల లక్ష్యాలను గూర్చి ప్రస్తావిస్తూ నగరపాలక సంస్థ రెవెన్యూ వసూళ్లు లక్ష్యాలను అధిగమించడం అభినందనీయమని అన్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మున్ముందు మరింత గణనీయమైన వృద్ధిరేటును సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అలాగే కుక్కలకు చేపడుతున్న సంతాన నిరోధక శస్త్ర చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో చేపడుతున్న గుంతల మరమ్మతు పనుల పై ఆరా తీశారు. ఇప్పటికే గుర్తించిన గుంతలలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపడుతున్నామని కమిషనర్‌ తెలిపారు. కాన్ఫరెన్స్‌లో సహాయ కమిషనర్‌ సిహెచ్‌ తిరుమలరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ కొండపల్లి సాంబమూర్తి, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లు రమణమూర్తి, హరిబాబు, డిఈలు శ్రీనివాసరావు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.నేటి నుంచి సర్వీస్‌ ప్రొవైడర్ల రెండు రోజుల మేళా నగరపాలకసంస్థ పరిధిలోగల 50 డివిజన్లలో గల 61 సచివాలయాల్లో సర్వీస్‌ ప్రొవైడర్లు అంటే ప్లంబర్సు, ఎలక్ట్రిషియన్లు, ఎసి, టివి మెకానిక్‌, వాటర్‌ ప్యూరిఫైయర్‌ మెకానిక్‌, రిఫ్రిజిరేటర్‌ మెకానిక్‌లకు ఈనెల 9,10 తేదీల్లో ఆనందగజపతి ఆడిటోరియంలో సర్వీస్‌ ప్రొవైడర్ల మేళా జరుగుతుందని కమిషనర్‌ నల్లనయ్య తెలిపారు. నగరంలోని సర్వీసు ప్రొవైడర్లంతా పేర్లు రిజిస్టర్‌ చేసుకోవాలని తెలిపారు.

➡️