ఏజెన్సీలో తొలగిన ఉత్కంఠ!

ఏజెన్సీలో తొలగిన ఉత్కంఠ!

గడువు దాటాక పోలింగ్‌పై ఒకటే టెన్షన్‌

స్ట్రాంగ్‌ రూముకు చేరిన ఇవిఎంలు

సాయుధ బలగాలతో పటిష్ట భద్రత

ఊపిరి పీల్చుకున్న అధికారులు

ప్రజాశక్తి -పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు, అరకు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సంఘం నిర్ధేశించిన గడువు దాటాక, రాత్రి 9గంటల వరకు ఓటింగ్‌ కొనసాగడంతో అధికారులు, పోలీసుల్లో ఒకటే టెన్షన్‌. సజావుగా పోలింగ్‌ ప్రక్రియ కొనసాగి, ఇవిఎంలు సురక్షితంగా స్ట్రాంగ్‌రూంకు చేరుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దీంతో ఎన్నికల యంత్రాంగం ఉత్కంఠ తొలగిందిసోమవారం అల్లూరి జిల్లాలో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నిర్ణీత సమయానికి పోలింగ్‌ ప్రారంభించినప్పటికీ ఉదయం 10 గంటల వరకు ఊపందుకోలేదు, మధ్యాహ్నం వర్షంతో అంతరాయం వల్ల నిర్ణీత సమయానికి పోలింగ్‌ పూర్తి కాలేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి క్యూలైన్లలో ఉండడంతో, వారందరకీ ఓటు హక్కు కల్పించాల్సిన పరిస్థితుల్లో చాలాచోట్ల రాత్రి 9గంటలు దాటే వరకు కూడా పోలింగ్‌ నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది.అల్లూరి మన్యంలో భౌగోళిక, శాంతిభద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల కమిషన్‌ సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ను ముగించాలని నిర్ధేశించింది. అయితే పాడేరు ఏజెన్సీలో అనేక చోట్ల నాలుగైదు గంటల సేపు అదనంగా పోలింగ్‌ నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురు కావడం ఎన్నికల యంత్రాంగానికి టెన్షన్‌ ఎదురైంది., పోలింగ్‌ కేంద్రాల వద్ద స్లిప్పుల పంపిణీ లోను ఆలక్ష్యం జరిగింది. చాలామంది ఆధార్‌ కార్డులతో వచ్చినప్పటికీ ఓటర్ల వివరాలు దొరకలేదు. ఎట్టకేలకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన వారందరికీ ఓటు హక్కు కల్పించి, తర్వాత ఇవిఎం, వివి ప్యాట్‌లను పాడేరులో స్ట్రాంగ్‌ రూమ్‌ కు తరలించే ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగింది. ఇవిఎంలన్నీ సురక్షితంగా స్ట్రాంగ్‌రూంకు చేరుకునే వరకు టెన్షన్‌కు గురైన అధికారులు, పోలీసులు, ఆ ప్రక్రియ సజావుగా సాగడంతో ఊపిరిపీల్చుకున్నారు. మంగళవారం ఉదయం: జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ఎం.విజయ సునీత, ఎన్నికల సాధారణ పరిశీలకులు కె. వివేకానందన్‌, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇవిఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరిచారు. పాడేరు రిటర్నింగ్‌ అధికారి జెసి భావన వశిష్ఠ్‌, అరకు రిటర్నింగ్‌ అధికారి ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌ సీలు వేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు : కలెక్టర్‌జిల్లాలో అత్యంత బాధ్యతతో, పారదర్శకంగా విధులు నిర్వర్తించి ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, వివిధ కేడర్ల అధికారులు, సిబ్బందితోపాటు పోలీసులు, ఓటర్లు, ఇలా సహకరించిన వారందరికీ జిల్లా ఎన్నికల అధికారి, కలక్టర్‌ ఎం. విజయ సునీత ధన్యవాదాలు తెలిపారు. పాడేరు, అరకు వ్యాలీ నియోజకవర్గాల ఇవిఎంలు సురక్షితంగా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రానికి చేరుకున్నాయని, ఎన్నికల సాధారణ పరిశీలకులు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికార్లు, సంబంధిత అభ్యర్దులు, రాజకీయ పార్టీల ప్రతినిదుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరచి సీలు వేశామన్నారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలక్టర్‌ వివరించారు. అల్లూరి జిల్లాలో 70.20శాతం పోలింగ్‌ అల్లూరి జిల్లాలో పాడేరు, అరకు, రంపచోడవరం అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్‌పై మంగళవారం సాయంత్రం అధికారులు తుది నివేదిక వెల్లడించారు. జిల్లాలో 70.20శాతం పోలింగ్‌ జరిగింది. జిల్లాలో ఏడు లక్షల 71 వేల 193 మంది ఓటర్లకు గాను, 5 లక్షల 41 వేల 360 మంది ఓటు వేశారు. జిల్లాలో మహిళా ఓటర్లు నాలుగు లక్షల 34 మందికి గాను రెండు లక్షల 75 వేల 286 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళల ఓటింగ్‌ శాతం 63.42 నమోదయింది. పురుష ఓటర్లులో 3 లక్షల 71 వేల 120 మందికిగాను 2 లక్షల 66 వేల 68 మంది ఓటు వేశారు. 71.69 శాతం శాతం నమోదయింది. పాడేరు అసెంబ్లీ స్థానానికి 2019లో జరిగిన ఎన్నికల్లో 61 శాతం పోలింగ్‌ జరగగా ఈసారి 63.91 శాతానికి పోలింగ్‌ పెరిగింది. అలాగే అరకు అసెంబ్లీ స్థానానికి గతసారి మాదిరిగానే ఈసారి కూడా 71.12 శాతం పోలింగ్‌ జరిగింది. గెలుపుపై ఎవరి ధీమా వారిదే!ఈ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పెరిగిన పోలింగ్‌ సరళిని బట్టి విజయావకాశాలపై బేరీజు వేస్తూ అంచనాలు మొదలుపెట్టారు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.బలపంలో రికార్డుస్థాయి ఓటింగ్‌చింతపల్లి : స్వాతంత్రం వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేనివిధంగా బలపం పంచాయతీలో కనీవిని ఎరగని రీతిలో పోలింగ్‌ శాతం పెరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరొందిన బలపంలో ఓటర్లలో చైతన్యం ఉరకలేసింది. రికార్డ్‌ స్థాయిలో పోలింగ్‌ నమోదు అయింది. మండలంలో మిగిలిన పోలింగ్‌ కేంద్రాలలో నమోదైన పోలింగ్‌తో పోలిస్తే బలపంలో 60 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. ఓటర్లు కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్వచ్ఛందంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

➡️