ప్రజాశక్తి-ఈపూరు : దిగుబడి బాగా వస్తుందని నమ్మించి విత్తనాలు అంటగట్టాడు.. పెట్టుబడి కూడా రూ.20 వేలు సర్దాడు. తీరా పంట కోత దశకు రాగానే లారీ వేసుకుని వచ్చి పంటనంతా తీసుకుని ఎకరానికి రూ.వెయ్యి చొప్పున రైతుల చేతిలో పెట్టబోయాడు. తమను మోసం చేయడమే కాకుండా పంట మొత్తాన్నీ తీసుకెళ్లడంపై కడుపు మండిన రైతులు పంట లారీని అడ్డుకున్నారు.. ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో జరిగిన ఘటనపై బాధిత రైతుల వివరాల ప్రకారం..మండలంలోని ఈపూరు, కొచ్చర్ల, అంగలూరు, బొమ్మరాజుపల్లి గ్రామాల రైతులు ఏజెంట్ల ద్వారా విత్తనాలు కొని సుమారు 150 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వీరికి విత్తనాలను కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన గురుప్రసాద్ అనే ఏజెంట్ అంటగట్టాడు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని నమ్మించి అమ్మడంతోపాటు పెట్టుబడి కోసం ఎకరాకు రూ.20 వేలు చొప్పున ఇచ్చాడు. ఈయన్ను నమ్మిన గ్రామంలోని 15 మంది రైతులు 50 ఎకరాల్లో సాగు మొక్కజొన్న సాగుచేశారు. పంట కోతకు రావడంతో విత్తనాలిచ్చిన ఏజెంట్ లారీతో గ్రామానికి గురువారం వచ్చి పంటను కోత కోయించి లారీల్లో ఎత్తించుకున్నాడు. తీరా లేక్కచూస్తే ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. కొందరికైతే 8 క్వింటాళ్లే. పైగా క్వింటాళ్‌కు రూ.3500 చొప్పున పది క్వింటాళ్లకు రూ.35 వేలు వస్తుందని చెప్పాడు. అందులో తాను పెట్టుబడిగా ఇచ్చిన రూ.20 వేలు, ఎకరాకు కోతకూలి రూ.14 వేలు పోగా మిగిలిన రూ.వెయ్యిని రైతుల చేతులో పెట్టబోయాడు. అప్పటికే తాము తీవ్రంగా నష్టపోయామని ఆగ్రహంతో ఉన్న రైతులు… ఏజెంట్‌ను నిలదీశారు. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని చెప్పావని, అందులో సగం కూడా రాలేదని, పైగా పంట కోత కూలీ ఇవ్వాలనే విషయం ముందుగా చెప్పలేదని నిలదీశారు. ఎకరా సాగుకు తమకు రూ.40 వేలు ఖర్చయితే రూ.వెయ్యి ఇవ్వడం ఏమిటని మండిపడుతూ లారీలోని తమ పంటను స్వాధీనం చేసుకున్నారు. తాము మోసపోవడంపై అధికారులు స్పందించాలని, నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
