ప్రజాశక్తి – మాచర్ల రూరల్ : తరతరాలుగా అంటరా నితనం, వర్ణవివక్షతో అవమానాలకు గురై దేవాలయం గడప తొక్కని కడజాతుల వారు తొలిసారి ఆలయ ప్రవేశం చేసింది ఆ గుడిలోనే.. మనుషులంతా ఒక్కటేనని శతాబ్ధాల క్రితమే చాపకూడు (కులమత భేదాలు లేకుండా కలిసి ఒకే పంక్తిలో చేసే భోజనాలు) అనే విప్లవాత్మక కార్యక్రమానికి వేదికగా నిలిచిన ఆ ఆలయమే మాచర్ల చెన్నకేశవాలయం. దళితుల ఆలయప్రవేశం, చాపకూడు కార్యక్రమాలు ద్వారా సర్వ మానవ సౌభ్రాతృత్వం చాటి, మాలకులంలో పుట్టిన కన్నమదాసును దత్తపుత్రునిగా స్వీకరించి వర్ణ ధర్మాలనే ఉక్కు చట్రాన్ని భేదించిన వాడు బ్రహ్మనాయుడు. మాచర్ల చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్న వేళ ఆలయంపై ప్రత్యేక కథనం..12వ శతాబ్ధం ఆరంభంలో 1103 నుండి 1182 వరకు మాచర్ల, గురజాల రాజధానులుగా పల్నాడు ప్రాంతాన్ని హైహయ వంశానికి చెందిన రాజులు పరిపాలన సాగించారు. 1140లో మంత్రిగానున్న బ్రహ్మనాయుడు మాచర్లలో చెన్నకేశవాలయం నిర్మించి ఆనాటి కుల,మత భేదాలను ఆ ఆలయం వేదికగా రూపుమాపే కృషి చేశాడు. కుల, మత, వర్ణ తేడాలు చూపకుండా కలసి వచ్చిన ప్రజలకు శ్రీచెన్నకేశవాల యంలో వీరవైష్ణవదీక్షను ఇచ్చాడు. దళితులను ఆలయ ప్రవేశం కల్పించటమే కాకుండా చాపకూడు పెట్టించాడు. గర్భగుడి పక్కనే అళ్వార్లుకు గుడి కట్టి అందులో అళ్వార్లును ప్రతిష్టించాడు. అందులో అంటరాని వారుగా పేరుబడ్డ వర్ణంలో పుట్టిన తిరుమలై ఆళ్వారు, తిరుప్పాదాళ్వారు, శూద్రులైన నమ్మాళ్వారు, తిరుమంగై ఆళ్వార్లుకు చెన్నకేశవస్వామితో సమానంగా పూజలు అందుకునేటట్లు ఏర్పాటు చేశాడు. వివిధ చెన్నకేశవస్వామి ఆలయాల్లో శూద్రులను అర్చకులుగా చేశాడు.
2 వేల ఎకరాల్లో మిగిలింది ఐదెకరాలే
చెన్నకేశవాయం ఒకప్పుడు ఎంతో సంపదగల ఆలయంగా ఉండేది. ఆలయ నిర్వహణ కోసం దాతలిచ్చిన రెండు వేల ఎకరాలకు పైగా భూములు పరాధీనమై ఐదెకరాలే మిగిలింది. హూండీల్లో కానుకలుగా రూ.9 లక్షలు, కొబ్బరికాయల వేలంలో రూ.లక్ష వస్తుండగా ఇది ఆలయ నిర్వహణ, దేవాదాయశాఖ అధికారులు, అర్చకుల వేతనాలకే సరిపోతోంది. ఉత్సవాల నిర్వహణకు చందాలు, దాతలు మీద ఆధారపడాల్సి వస్తోంది.
12న కళ్యాణం – 17న రథోత్సవం
శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఏటా చైత్ర త్రయోదశి రోజున ప్రారంభమవుతుతాయి. 11న ధ్వజారోహణ, 12న శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి కళ్యాణం, 13న హనుమధ్వాహనం, 14న శేషవాహనం, 15న గరుడ వాహనం, 16న రవిపొన్న వాహనం, 17న రథోత్సవం, 18న అశ్వవాహనం, 19న శుక వాహనం, 20న పుష్పయాగం, 21న ద్వాదశ ప్రదక్షణలు, 22న ఏకాశీతి కలశస్థాపన, 23న పవళింపుసేవ, 25న పదహారు రోజుల పండుగతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 12న జరిగే కళ్యాణోత్సవం, 17న జరిగే రాష్ట్రంలోనే అతిపెద్దదైన (ఎత్తు) కలిగిన రథోత్సవానికి రెండు తెలుగురాష్ట్రాల నుండి వేల మంది సందర్శకులు వస్తుంటారు. వీరికి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
గురువారం నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావు పరిశీలించారు. ఆలయ పరిసరాలను, రథం, రథం తిరిగే బజారును పరిశీలించి ఏర్పాట్లపై ఆర్డీవో మురళీకృష్ణ, తహశీల్దార్ కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, ఆలయ ఈవో పూర్ణచంద్రరావుతో మాట్లాడారు. సందర్శకులకు తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, పారిశుధ్య సమస్యలు రానివ్వొద్దని చెప్పారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్, ఎస్పీని దేవాలయ కమిటి సన్మానించింది.
