వార్డెన్‌ దాష్టీకం

Apr 15,2025 21:27

 విద్యార్థులతో కప్పగంతులు 

మెట్లపై తల కిందకు, కాలుపైకి పెట్టి చితక్కొట్టిన వైనం

ఏకలవ్య పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి..

ప్రజాశక్తి – మక్కువ : చేయని తప్పుకు శిక్ష అంటే ఇదేనేమో… పాఠశాలలో పనిచేస్తున్న ఎఎన్‌ఎం ఆరబెట్టిన బట్టలు కనిపించకపోవడం పెద్ద పొరపాటైంది. ఇది విద్యార్థుల అల్లరి చేష్టల్లో పని అని భావించి ఏకంగా మూడు తరగతుల విద్యార్థులను వార్డెన్‌ చితక్కొట్టిన విషయం అనసభద్ర ఏకలవ్య పాఠశాలలో ఆదివారం రాత్రి జరగ్గా, మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో కొమరాడ, సాలూరు మండలాల నుంచి వారు పాఠశాలకు చేరుకున్నారు. అలాగే ఎపి గిరిజన సంఘం నాయకులు తాడంగి ప్రభాకర్‌, విద్యార్థి సంఘం నాయకులు, పాఠశాల కమిటీ చైర్మన్‌ మల్లయ్య మంగళవారం పాఠశాలకు చేరుకొని ఆరా తీశారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఆదివారం ఎఎన్‌ఎం ఆరబెట్టిన బట్టలు కనిపించలేదు. దీంతో విద్యార్థులే వాటిని దాచి పెట్టారేమోనని భావించిన వార్డెన్‌ సురేష్‌బాబు 7, 8, 9 తరగతులకు చెందిన విద్యార్థులను చిత్రహింసలకు గురిచేశారు. ఆదివారం రాత్రి సుమారు 12 గంటల వరకు డార్మెటరీ రూమ్‌ వద్ద కప్పగంతులు వేయించి అక్కడ మెట్లపై తలకిందులుగా పడుకోబెట్టి బాగా కొట్టారని కొమరాడకు చెందిన స్థానిక విద్యా కమిటీ చైర్మన్‌ మల్లయ్య, సాలూరు మండలానికి చెందిన కె.చందర్రావు, ఎస్‌.ఈశ్వరరావు చెప్పారు. ఇప్పటికీ విద్యార్థులు సరిగ్గా నడవలేకపోతున్నారని కాళ్లు, ఒళ్లు అంతా నొప్పితో బాధపడుతున్నారని వారు కలత చెందారు. సుమారు వందమంది విద్యార్థులను ఇలా చిత్రహింసలకు గురి చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.వార్డెన్‌ను సస్పెండ్‌ చేయాలి చేయని తప్పుకు విద్యార్థులను చిత్రహింసలకు గురి చేసిన ఏకలవ్య పాఠశాల వార్డెన్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఎపి గిరిజన సంఘం నాయకులు టి.ప్రభాకర్‌ ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. హాస్టల్‌ వద్ద కనీస సౌకర్యాలు కూడా లేవని, అలాగే భోజన పదార్థాలు కూడా సక్రమంగా లేవని పిల్లలు తమ వద్ద వాపోయారని వారు తెలిపారు. ఈ సంఘటన జరగక ముందు నాలుగు రోజుల క్రితం సుమారు 80 మంది విద్యార్థులు ఆహారం సరిగ్గా లేక కడుపునొప్పితో రోజంతా బాధపడ్డారని, ఈ విషయం కూడా ఇప్పుడే బయటకు వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరిపడా తాగునీటి సౌకర్యం కూడా లేదని, దీంతో ఆలస్యంగా రావడం వల్ల కూడా విద్యార్థులకు క్రమశిక్షణా చర్యల పేరుతో విద్యార్థులకు శిక్షలు వేయడం సరికాదని వారు అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని లేదంటే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.తప్పు జరగడం వాస్తవమే..విద్యార్థుల పట్ల వార్డెన్లు చేసిన చిత్రహింసలు తనకు ఆలస్యంగా తెలిసిందని ప్రిన్సిపాల్‌ బి ఎర్రునాయుడు తెలిపారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ విషయం మంగళవారం ఉదయం వరకు తన దృష్టికి కూడా రాలేదన్నారు. విద్యార్థులు కూడా చెప్పలేదని తెలిపారు. స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు కూడా తనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారని, ఈ విషయం ఐటిడిఎ పిఒ కూడా తెలియజేమని తెలిపారు. ప్రతి శాఖ వేర్వేరుగా ఉండడం వల్ల కొన్ని విషయాలు బయటకు తెలియడంలేదని తెలిపారు. ఏది ఏమైనా ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందజేస్తామన్నారు.

➡️