పేరుకుపోతున్న చెత్త కుప్పులు

Mar 20,2025 00:44

భాగ్య నగర్‌లో మెయిన్‌ రోడ్‌లో చెత్తకుప్ప
ప్రజాశక్తి-గుంటూరు :
గుంటూరు నగరంలో పారిశుధ్యం మెరుగుదలకు అనేక సంస్కరణలు అమలు చేస్తున్నా పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వట్లేదు. ఇటీవల కాలంలో రోడ్లపై ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనం ఇస్తున్నాయి. ప్రధాన రోడ్లు మినహా అంతర్గత రోడ్లు, కాలనీల్లో చెత్త కుప్పులు పేరుకుపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లో సరిపడా వర్కర్లు లేకపోవటం, డంపర్‌ బిన్నులు తొలగించటంతో ప్రజలు అదే ప్రదేశంలో చెత్తను పడేస్తున్నారు. రెండు మూడు రోజులపాటు చెత్త రోడ్లపైనే ఉంటుంది. దీంతో వాటి చుట్టుపక్కల నివశించే ప్రజలు తీవ్ర అసౌకార్యనికి గురవుతున్నారు. గుంటూరులో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. విలీన గ్రామాలతో కలుపుకొని దాదాపు నగర జనాభా 10 లక్షలు ఉంటుంది. కానీ ఆ స్థాయిలో వర్కర్లు సరిపడా లేరు. ఇటీవల డివిజన్ల వారీగా వర్కర్లను రేషనలైజేషన్‌ చేసినా ఇంకా కొరత ఉందని సంఘాల నాయకులు అంటున్నారు. ఉన్న వారిలోనే ఇతర పనుల్లో కొనసాగుతున్న వారు ఉన్నారు. దాదాపు 140 మంది సిబ్బంది శానిటరీ వర్కర్లు, సూపర్‌వైజర్వుగా, ఇతర విభాగాల్లో ఉన్నారు. ఇటీవల కమిషనర్‌ వారిని వెనక్కి వెళ్లాలని ఆదేశించినా కొద్ది మంది మాత్రమే వెళ్లారు. ఎక్కువ మంది వెనక్కి వెళ్లలేదని సమాచారం. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వారిని వ్యక్తిగత పనుల కోసం వినియోగించుకున్నట్లు తెలిసింది. ప్రజలు ఇంట్లో వ్యర్థాలను వర్కర్లకు నేరుగా ఇవ్వాలని, రోడ్లపై వేయకూడదని చూడాలని నిర్ణయించి, ఆమేరకు రోడ్లపై ఉండే డంపర్‌బిన్‌ చాలా చోట్ల తొలగించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వర్కర్లు సేకరించిన చెత్తను డస్ట్‌ బిన్లలో ఉంచి ట్రాక్టర్‌ వచ్చే వరకూ వేచి ఉండి ట్రాక్టర్లలో వేయాలి. ఒక్కో ట్రాక్టర్‌ డంపింగ్‌ యార్డులో అన్‌లోడ్‌ చేసి తిరిగి లోడింగ్‌కు రావటానికి కనీసం గంట నుంచి రెండు గంటలకుపైగా సమయం పడుతుందని అంటున్నారు. దీంతో వర్కర్లు అంతసేపు అక్కడే వేచి ఉండాల్సిందే. డ్యూటీ సమయం ముగిసినా అనేక మంది వర్కర్లు అక్కడే వేచి ఉండాల్సి వస్తోంది. ఉదయం 5.30కు పనిలో చేరిన వర్కర్లు సాధారణంగా మధ్యాహ్నం రెండు, రెండున్నర గంటలకు విధులు ముగించుకోవాలి. కొన్నిచోట్ల డంబర్‌ బిన్‌లు లేకపోవటం, ట్రాక్టర్లు రాకపోవటంతో సాయంత్రం నాలుగు, ఐదు గంటలసేపు వేచి ఉండాల్సి వస్తోంది. లేదంటే డస్ట్‌ బిన్లలో అక్కడే వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. మరోవైపు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకుండానే డంబర్‌ బిన్‌లు తీసేయటంతో లక్ష్యం నెరవేరట్లేదు. చాలాచోట్ల డంబర్‌ బిన్‌లు ఉన్న ప్రదేశాల్లోనే చెత్త వేస్తున్నారు. దీంతో వర్కర్లు సేకరించిన చెత్త, ప్రజలు వేసిన చెత్త కలిపి పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. మరోవైపు చెత్త తరలించే ట్రాక్టర్లు నిర్వహణ సక్రమంగా లేదు. కనీసం పంక్చర్‌ పడితే వెహికల్‌ షెడ్‌లో పంక్చర్‌ వేసే పరిస్థితి లేదు. సామాన్లు లేకపోవటంతో డ్రైవర్లు బయట పంక్చర్లు వేయిస్తున్నారు. గత 10-15 ఏళ్లుగా నగరంలో దాదాపు 250 మంది బదిలీ వర్కర్లు రోజువారీ వేతనంపై పనిచేస్తున్నారు. పని ఉన్న రోజే వీరికి వేతనం ఇస్తారు. లేని రోజు జీతం లేనట్లే. వర్కర్ల కొరత ఉన్న నేపథ్యంలో బదిలీ వర్కర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సంఘాలు కోరుతున్నాయి.

➡️