ఎన్నికకు హాజరైన ఐదుగురు కౌన్సిలర్లు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల మున్సిపల్ వైస్‌చైర్మన్-2 ఎన్నిక మరోసారి వాయిదా పడింది. అయితే వైసిపి కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆరోపించారు. తొలిరోజైన సోమవారం వైసిపి కౌన్సిలర్లు రాకుండా టిడిపి నాయకులు అడ్డుకోగా ఎన్నిక వాయిదా పడింది. రెండోరోజైన మంగళవారం 32 మంది కౌన్సిలర్లలో ఐదుగురు మాత్రమే హాజరవడంతో కోరం లేని కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఒ) అయిన ఆర్‌డిఒ మురళి ప్రకటించారు. పిడుగురాళ్ల మున్సిపాల్టీలో మొత్తం 33 వార్డులకుగాను గత స్థానిక ఎన్నికల్లో వార్డులన్నింటినీ వైసిపి ఏకగ్రీవం చేసుకుంది. సాధారణ ఎన్నికలప్పుడు ఒక కౌన్సిలర్ టిడిపిలో చేరారు. వైస్‌చైర్మన్-2గా వ్యవహరిస్తున్న 7వ వార్డు కౌన్సిలర్ కె.ముక్కంటి అనారోగ్య కారణాలతో మృతి చెందగా వైస్‌చైర్మన్ ఎన్నిక చేపట్టారు. 15వ వార్డు కౌన్సిలర్ రేపాల రమాదేవిని ఎన్నికోవాలని వైసిపి నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిరోజైన సోమవారం 26 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం వద్దకు రాగా వారు లోపలికి వెళ్లకుండా టిడిపి నాయకులు అడ్డుకున్నారు. నిర్ణీత సమయంలో కౌన్సిలర్లు రాలేదనే కారణంతో ఎన్నికలను మంగళవారానికి ఆర్‌ఒ వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా వైసిపికి చెందిన 32 మంది కౌన్సిలర్లలో ఐదుగురే హాజరయ్యారు. వీరిలో 15వ వార్డు కౌన్సిలర్ జోగిపర్తి సుజాత, 20వ వార్డు కౌన్సిలర్ కొత్త తులసి, 21వ వార్డు కౌన్సిలర్ కొత్త పుష్పలత, 28వ వార్డు కౌన్సిలర్ గర్రె నాగేశ్వరావు, 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతి ఉన్నారు. 12 గంటల వరకూ చూసిన ఆర్‌ఒ ఎన్నికను వాయిదా వేశారు. వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పంపుతామని, ఎన్నిక ఎప్పుడు నిర్ణయిస్తారో వారే తెలుపుతారని ప్రకటించారు.ఇదిలా ఉండగా 12 లేదా 13 మంది వైసిపి కౌన్సిలర్లు ఎన్నికకు హాజరవకుండా పోలీసులే కిడ్నాప్ చేయించారని మాజీ ఎమ్మెల్యే కాసుమహేష్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక వైసిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు పోలీసులు కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి కేసులున్నాయంటూ తీసుకెళ్లారని, వారిని ఎక్కడ ఉంచారో కూడా తెలియడం లేదని, ఫోన్లు కూడా కలవడం లేదని చెప్పారు. ఒక కౌన్సిలర్ కరిముల్లా ఫోన్ మాత్రం కలిసిందని, సిఐ డ్రైవర్ కొండా వచ్చి సిఐ రమ్మంటున్నాంటూ చెప్పాడని, పక్కనే కొంతమంది టిడిపి నాయకులు కారును ఏర్పాటు చేసుకుని ఉన్నట్లు వారి మాటలు వినిపించారని తెలిపారు. దీనికి పట్టణ సిఐ వెంకటరావు బాధ్యత వహించి కౌన్సిలర్లను విడుదల చేయాలని, లేకుంటే న్యాయపోరాటం చేస్తామని అన్నారు. దీనిపై ఎస్పీతో మాట్లాడ్డంతోపాటు ఎన్నికల కమిషన్ దృష్టికీ తీసుకెళ్తామన్నారు.
