ఎస్‌బిఐ ఖాతాదారుల సేవా కేంద్రంలో చోరీ

May 19,2024 20:54

ప్రజాశక్తి – రామభద్రపురం : మండల కేంద్రంలో గత 5 ఏళ్ళ నుంచి నిర్వహిస్తున్న ఎస్‌బిఐ సేవా కేంద్రంలో చోరీ జరిగింది. ఆదివారం కేంద్రం నిర్వాహకులు పివి సత్యారావు కేంద్రం తెరిచే సమయంలో చోరీ జరిగినట్లు గుర్తించి స్థానిక ఎస్‌ఐ జ్ఞాన ప్రసాద్‌కు సమాచారం అందించారు. వెంటనే ఎస్‌ఐ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రం క్లూస్‌ టీమ్‌కు సమాచారం అందించారు. క్లూస్‌ టీమ్‌ వచ్చి పరిశీలించి చోరీ తీరుపై ఆదారాలు సేకరించారు. సుమారు రూ.1.66 లక్షలు నగదుతో పాటు లాప్‌ టాప్‌, రెండు కరెంట్‌ అకౌంట్‌ ఎటిఎం కార్డులు కూడా చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు సేవా కేంద్రం నిర్వాహకులు సత్యారావు తెలిపిన వివరాల మేరకు శనివారం మధ్యాహ్నం కేంద్రం క్లోజ్‌ చేసి బోజన విరామంకు వెళ్లామని, సాయంత్రం అనివార్య కారణాల వల్ల కేంద్రం తెరవలేకపోయామని అప్పటికే ఉన్న క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ తోపాటు వేరే కేంద్రంకు ఇవ్వవలసిన మొత్తం రూ.40 వేలు కూడా చోరీ జరిగిందని తెలిపారు. షట్టర్‌ తెరువలేక గ్రిల్స్‌ తాళం పగలు కొట్టి లోనికి ప్రవేశించి లోపల తలుపులు తెరచి ప్రవేశించి చోరీ చేశారని వివరించారు. ఎటిఎం కార్డులు కూడా ఉపయోగించి నగదు తీసే ప్రయత్నం చేశారన్నారు. అయితే ఒక కార్డులో డబ్బు ఉన్నప్పటికీ పిన్‌ నెంబర్‌ ఇన్‌ కరెక్ట్‌ అవడం ఇంకో కార్డు పిన్‌ నెంబర్‌ కరెక్ట్‌ అయినప్పటికీ నగదు నిల్వలు లేకపోవడంతో వాటి నుంచి నగదు డ్రా అవ్వలేదన్నారు. వీటి ఆధారంగా దర్యాప్తు చేస్తే దుండగులు దొరికే అవకాశం ఉందన్నారు. ఎస్‌ఐ జ్ఞాన ప్రసాద్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

➡️