అప్పుడు బతిమాలి.. ఇప్పుడు గద్దింపు..

Mar 23,2025 00:57

ఎంపిడిఒ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలు
ప్రజాశక్తి – తుళ్లూరు :
సామాజిక పింఛన్ల పంపిణీ నుంచి మినహాయించాలని కోరుతూ అంగన్వాడీలు స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.భాగ్యరాజు మాట్లాడుతూ గతంలో వాలంటరీల ద్వారా పంపిణీ చేసే ఫింఛన్లను ప్రస్తుతం అంగన్వాడీల చేత చేయిస్తున్నారని చెప్పారు. ఫింఛన్ల పంపిణీ ప్రారంభంలో ఒకటి లేదా రెండు నెలలు మాత్రమేనని చెప్పి తొమ్మిది నెలలుగా చేయిస్తున్నారని అన్నారు. తొలినాళ్లలో బతిమాలి ఇప్పుడు గద్దిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. మందడం గ్రామంలో అంగన్వాడీ టీచర్‌ భర్త ఐసీయూలో, కొడుకు కాలు విరిగి బెడ్‌ మీద ఉన్నప్పటికీ బెదిరించి మరీ డ్యూటీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సమస్యలను ఎంపిడిఒ శిల్పాకు విన్నవిస్తుండగా ఆమె కసురుకుంటూ చేపల మార్కెట్‌ల ఏమిటంటూ హేళనగా మాట్లాడారని నాయకులు మండిపడ్డారు. కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు స్వర్ణలత,అన్నామణి, కరీమూన్‌,రజని, తులసి పాల్గొన్నారు.

➡️