అప్పుడు నామినేషన్‌ పత్రాలనే చించేశారుగా..

Feb 4,2025 00:58

వైసిపి కౌన్సిలర్‌ నుండి పత్రాలు తీసుకుంటున్న టిడిపి నాయకుడు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : వైసిపి కౌన్సిలర్లను టిడిపికి చెందినవారు అడ్డుకోవడంతో సోమవారం జరగాల్సిన పిడుగురాళ్ల మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌-2 ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. వైస్‌చైర్మన్‌ అభ్యర్థి తొలుత ఉదయం 10 గంటల్లోపు ఫారం-బి లేదా ఫారం-ఎను రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తారు. అయితే నిర్ణీత సమయంలో ఎవరూ ఫారాలు ఇవ్వకపోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఒ) అయిన ఆర్‌డిఒ మురళి ప్రకటించారు. పట్టణంలో మెత్తం 33 వార్డులకుగాను గతంలో నిర్వహించిన ఎన్నికల్లో అన్ని స్థానాలనూ వైసిపి ఏకగ్రీవం చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కౌన్సిలర్‌ ఉన్నం ఆంజనేయులు టిడిపి పార్టీలో చేరారు. వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఏడో వార్డు కౌన్సిలర్‌ కొమ్ము ముక్కంటి అనారోగ్య కారణాలతో చనిపోగా ఆ పదవికి సోమవారం ఎన్నిక నిర్వహణకు నిర్ణయించారు. ఈ పదవికి 15వ వార్డు కౌన్సిలర్‌ రేపాల రమాదేవిని ఎన్నుకునేందు వైసిపి కౌన్సిలర్లు కౌన్సిలర్లు తీర్మానించుకున్నారు. ఉదయం మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు కొద్దిదూరంలోనే బారీకేడ్లు పెట్టి కౌన్సిలర్లను మినహా మిగతావారిని ఆపేశారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద కౌన్సిలర్లను టిడిపి నాయకులు అడ్డుకుని ఎన్నిక జరగడానికి వీల్లేదని బయటే నిలిపేశారు. దీంతో ఇరుపక్షాలకు కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. స్థానిక ఎన్నికలప్పుడు తమ పార్టీ అభ్యర్థులను కనీసం నామినేషన్‌ కూడా వేయనీయకుండా అడ్డుకున్నారని, మహిళలనీ చూడకుండా వారి నామినేషన్‌ పత్రాలను చించేశారని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా చనిపోయిన వైస్‌ చైర్మన్‌ ఎస్సీ సామాజిక తరగతికి చెందిన వ్యక్తికాగా ఆ స్థానంలో ఓసీలను ఎలా ఎన్నుకుంటారని ప్రశ్నించారు. సమయం మించి పోయాక 11 గంటల తర్వాత వైసిపి కౌన్సిలర్లను కార్యాలయంలోకి అనుమతించారు. అయితే అప్పటికే సమయం మించిపోయిందని, ఎన్నికను మంగళవారం నిర్వహిస్తామని ఆర్‌ఒ చెప్పారు. అయితే తాము సమయానికే వచ్చామని, టిడిపి నాయకులు అడ్డుకోవడం వల్ల ఆసల్యమైందని వైసిపి కౌన్సిలర్లు చెప్పగా.. తాను చేసేదేమీ లేదని ఆర్‌ఒ స్పష్టం చేశారు. దీంతో వైసిపికి చెందిన 24 మంది కౌన్సిలర్లు తమ అంగీకా పత్రాలు, వైస్‌చైర్మన్‌ అభ్యర్థి ఫారం-బి, ఫారం-ఎ పత్రాలను ఆర్‌ఒకు అందజేశారు. ఎన్నికకు మంగళవారం హాజరవుతామని చెప్పారు.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే టిడిపి నాయకుల దౌర్జన్యం : మహేష్‌ రెడ్డి
వైసిపి కౌన్సిలర్లను అడ్డుకోవడంపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. స్థానిక వైసిపి కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యబద్ధంగా కనీసం ఓటైనా వేయనీయకుండా టిడిపి అడ్డుకుంటోందని, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలోనే టిడిపి నాయకులు ఈ దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలను సజావుగా జరిగేలా చూడాల్సిన పోలీసులే కౌన్సిలర్లను అడ్డుకున్నా ఎన్నికల కమిషన్‌ చూస్తూ ఉండిపోయిందని అన్నారు. కేవలం ఒక వైస్‌చైర్మన్‌ పదవి కోసమే టిడిపి ఇంతగా దిగజారిపోయిందని ఎద్దేవ చేశారు. ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి చిల్లర పనులు చేస్తున్నారని, వైసిపి లక్ష్యంగా దాడులు చేస్తున్నారని విమర్శించారు. తమ కౌన్సిలర్లు తప్పనిసరిగా ఎన్నికల్లో పాల్గొని తీరుతారని చెప్పారు.
ప్రజాస్వామ్యం గురించి వైసిపి మాట్లాడ్డం హాస్యాస్పదం : టిడిపి
అధికార మదంతో మున్సిపల్‌ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుని ఇప్పుడు ప్రజస్వామ్యం గురించి ఎమ్మెల్యే మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందని కూటమి పార్టీల నాయకులు విమర్శించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు ఖండనగా స్థానిక టిడిపి కార్యాలయంలో వారు మాట్లాడుతూ వైఎస్‌ చైర్మన్‌ పదవి గతంలో ఎస్సీలకు చెందిన వ్యక్తి కాగా ఇప్పుడు ఓసీలను ఎంపిక చేయడం ద్వారా ఎస్సీలంటే మహేష్‌రెడ్డికి ఎంత ప్రేమో అర్థమవుతోందన్నారు. సఖ్యత లేని వైసిపి కౌన్సిలర్లు పదవి కోసం తన్నుకుంటుంటే కూటమి ఏదో చేస్తోంద,ని విమర్శించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై అనవసరపు వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

కౌన్సిలర్లు, వారితోపాటు వచ్చిన వారిని నిలిపేసిన పోలీసులు

➡️