తొలి జాబితాలో నలుగురి పేర్లు

Jun 11,2024 23:39

 ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుతోపాటు ఇతర మంత్రివర్గమూ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లా నుంచి ఎవరికి స్థానం దక్కుతుందనేది ఉత్కంఠ భరితంగా మారింది. రాత్రి 11 గంటల వరకు టిడిపి నుంచి స్పష్టమైన జాబితా బయటకు రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఎంపికలు జరుగుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈసారి నలుగురి పేర్లు తొలిపరిశీలనలో దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. వీరిలో టిడిపి నుంచి నారా లోకేష్‌, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్‌ పేర్లు ఉన్నట్టు తెలిసింది. చివరి దశలో మార్పులు జరిగితే రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ పేరు కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇతర జిల్లాలల్లో జరిగే మార్పులకు అనుగుణంగా చివరి దశలో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్‌కు కచ్చితంగా ఉండటం వల్ల టిడిపిలో కీలకమైన నేతల ఆశలపై నీళ్లుచల్లినట్లు తెలిసింది. నాదెండ్లను మరోసారి స్పీకర్‌ పదవి తీసుకోవాలని చంద్రబాబు వత్తిడి తెస్తున్నారని కూడా టిడిపి వర్గాల్లో ప్రచారమవుతోంది. ఇందుకు మనోహర్‌ ససేమిరా అన్నట్టు సమాచారం. మనోహర్‌ మంత్రి పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు. స్పీకర్‌ పదవి ఇస్తే మాత్రం సీనియర్‌ ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, జి.వి.ఆంజనేయులులో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. బాపట్ల జిల్లా పరిధిలో సమీకరణలు మారి ఆనంద్‌బాబుకు అవకాశం ఇవ్వకపోతే తనకు ఛాన్సు వస్తుందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఆశపడుతున్నారు. టిడిపి నుంచి పోటీ చేసిన వారందరూ ఎన్నిక కావడంతో ఈసారి పార్టీలో అంతర్గతంగా పోటీ పెరిగింది.జూనియర్‌, సీనియర్‌ తేడా లేకుండా ఎవరికి వివిధ సామాజిక తరగతుల్లో తమకు మంత్రిగా అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికైన నశీర్‌ అహ్మద్‌ మైనార్టీ కోటాలో, బిసి మహిళగా గళ్లా మాధవి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. బిసి కోటాలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ పేరు వినిపిస్తోంది. ఆయన వరసగా మూడుసార్లు గెలుపొందడం కూడా, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో బిసిల్లో సీనియర్‌గానూ ఆయన ఉండడం కీలకంగా మారింది. మనోహర్‌, లోకేష్‌కు స్థానం దక్కడం వల్ల కమ్మ సామాజిక తరగతిలో ఇతర సీనియర్‌ నాయకులకు అవకాశం తక్కువగా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బిజెపి, జనసేన నుంచి కూడా ఇదే సామాజిక తరగతుల నుండి ఇద్దరికి అవకాశం ఉంటుందని ప్రచారంతో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో పత్తిపాటి పుల్లారావు, యరపతినేని, జి.వి. ఆంజనేయుల ఆశలపై నీళ్లుచల్లినట్టు అయిందంటున్నారు. అయితే చంద్రబాబు మనస్సులో ఏముందో.. గతంలో పార్టీకి తాము చేసిన సేవలకు అనుగుణంగా తమకు ప్రాధాన్యం ఉంటుందని టిడిపి నుంచి గెలిచిన సీనియర్‌ ఎమ్మెల్యేలు ఆశపడుతున్నారు.

➡️