ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రమైన నార్పలలో ప్రతి శనివారం జరిగే సంతలో సెల్ ఫోన్ల చోరీలకు పాల్పడే దొంగలు హల్ చల్ చేస్తున్నారు. సంతలో ఒక వినియోగదారుని సెల్ ఫోన్ ను దొంగ చాకచక్యంగా దొంగతనం చేస్తున్న దృశ్యం సంతలో ఉన్న ఒక దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఆ సెల్ఫోన్ చోరీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సిసి ఫుటేజ్ ఆధారంగా సెల్ఫోన్ చోరీలకు పాల్పడే దొంగలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. త్వరలోనే నార్పలలో సెల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా గుట్టు రట్టు చేస్తామని ఎస్సై సాగర్ తెలిపారు.