లెక్క తేలడం లేదు… అంతుచిక్కడం లేదు

May 16,2024 20:32

 ప్రజాశక్తి – పూసపాటిరేగ’ : లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అంటూ అలనాటి సినిమా గీతం నేడు నెల్లిమర్ల నియోజకవర్గ రాజకీయ శిబిరాల్లో చక్కర్ల కొడుతోంది. నియోజకవర్గంలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉండడమే కాకుండా ఓటు హక్కును వినియోగించుకున్నది మహిళలేనని అధికారిక లెక్కలు తేల్చేశాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు గెలుపోటములు అంచనాలు వేయడంలో తలలు పట్టుకుంటున్నారు. రెండు రోజులుగా గ్రామాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. అయినా మహిళ మనస్సులో ఏముందో లెక్క లేలడం లేదు.. అంతు చిక్కడం లేదు. ఇంత పెద్ద ఎత్తున మహిళల్లో వెల్లువిరిచిన చైతన్యం ఎవరికి పట్టం కట్టిందో? ఎవరిని పక్కన పెట్టిందో? అని తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోనే నెల్లిమర్ల నియోజకవర్గం అత్యధికంగా పోలింగ్‌ నమోదు చేసుకుని రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అందరి దృష్టీ నెల్లిమర్ల పోలింగ్‌పై పడేటట్టు చేసింది. నెల్లిమర్ల నియోజకవర్గంలో మొత్తం 2,13,551 ఓటర్లుండగా 1,88,456 మంది ఓటు హక్కును వినియోగించుకొని 88.25 శాతం నమోదై రికార్డు నెలకొల్పారు. నియోజకవర్గంలో పురుషులు కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఓటు హక్కును కూడా మహిళలే ఎక్కువగా వినియోగించుకున్నారు. అంటే 1,88,456 ఓట్లు నమోదవగా అందులో అత్యధికంగా మహిళలు 95,635 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడదే నెల్లిమర్ల నియోజకవర్గం నేతలు తలలు పట్టుకునేలా చేసింది. మహిళా ఓట్లు ఎవరికి వెల్లినట్లు…? ఎన్నడూ లేని విదంగా ఇంత మొత్తంలో మహిళా చైతన్యం ఎందుకు వచ్చింది…? అన్నది చర్చకు దారి తీసింది. తాము గెలుస్తామంటే తాము గెలుస్తామని అధికార వైసిపి, ఎన్‌డిఎ కూటమి అభ్యర్థులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మధన పడుతున్నారు. దీని వెనుక మహిళలు అత్యధికంగా ఓటు హక్కు నమోదు చేసుకోవడమే కారణంగా తెలిస్తోంది. మహిళా ఎవరి వైపు..?మహిళా ఓట్లు ఎవరివైపు వెలతాయన్నది ప్రధానంగా చర్చనీయాంశమవుతోంది. అధికార వైసిపి ప్రభుత్వం మహిళకు ప్రాధాన్యత ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వ పధకమైనా మహిళకే నేరుగా అందించింది. అమ్మఒడితోపాటు కాపునేస్తం, చోదోడు, ఆసరా లాంటి పథకాలతో ఆకర్షితులైన మహిళలు ఎక్కువగా వైసిపికి పట్టం కట్టారా అన్నది చర్చ ఉండగా మరో వైపు ఎన్‌డిఎ కూటమి ప్రకటించిన సూర్‌ సిక్స్‌ మహిళలను ఆకట్టుకున్న సంగతి కొంత మంది చెబుతున్నారు. ఎందుకంటే సూపర్‌ సిక్స్‌లో అమ్మఒడితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు నెలకు రూ.1500 సహాయం, మూడు గ్యాస్‌ బండలు ఇవి మహిళలను ఒకింత ఆకర్షణకు గురి చేసి ఉండొచ్చు. పైగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మహిళా కావడం కూడా వారికి కలిసి వచ్చే అంశంగా చర్చించుకుంటున్నారు. అయితే మహిళలు ఏ పథకాలకు ఆకర్షితులై ఇలా వెల్లువలా ఓట్లు వేయడానికి క్యూ కట్టారన్నది అంతుచిక్కడం లేదు. గెలిచేది ఎవరో తేల్చేది మహిళలేనని నిర్ణయానికి వచ్చేసారు. మహిళలు మాత్రం ఎవరికి పట్టం కట్టారో గుట్టు విప్పడం లేదు. ఫలితాలు వచ్చే వరకూ మహిళలు మనస్సులో ఏవరున్నారో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

➡️