కుష్టు వ్యాధిపై అవగాహనా కార్యక్రమాలు
ఆస్పత్రుల్లో మందులన్నీ అందుబాటులోనే..
‘ప్రజాశక్తి’తో డిఎంహెచ్‌ఒ జీవనరాణి ముఖాముఖి
ప్రజాశక్తి-విజయనగరంకోట : కుష్టు వ్యాధిపై ఈనెల 13 వరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. స్పర్శ లేని మచ్చలున్న వారు తమ దగ్గరలోని వైద్యఆరోగ్య సిబ్బందిని సంప్రదించి తనిఖీలు చేయించుకోవాలని చెప్పారు. సీజనల్ జ్వరాలు, వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎక్కడా డయేరియా లేదని, ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ప్రజాశక్తికి ఆమె ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు.
విజయనగరంలో స్కానింగ్, మెడికల్ పరీక్ష కేంద్రాలు పుట్టగొడుగుల్లా మాదిరిగా పుట్టుకొస్తున్నాయి. వీటికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా, జిల్లా వ్యాప్తంగా ఎన్ని స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి?
జిల్లాలో ప్రభుత్వ పరిధిలో స్కానింగ్ సెంటర్లు ప్రభుత్వ పరిధిలో 23 ఉండగా ప్రవేట్ పరిధిలో 92 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. మెడికల్ పరీక్ష ల్యాబ్‌లు ప్రైవేటు పరిధిలో 64ఉన్నాయి. వీటన్నింటికీ అనుమతులున్నాయి.
జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినంత వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా ? రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదనే ఫిర్యాదులున్నాయి?
జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ తగినంత వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. గతంతో పోలిస్తే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. రోగులు ప్రైవేటు ఆస్పత్రులను కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులను వినియోగించుకోవాలి.
జిల్లాలో క్షయ, ఎయిడ్స్ ,కుష్టు వ్యాధి గ్రస్తులు ఎంతమంది ఉన్నారు? గత మూడు నాలుగు ఏళ్ల కంటే రోగుల సంఖ్య తగ్గిందా పెరిగిందా?
జిల్లా వ్యాప్తంగా టిబి కేసులు 2024 కన్నా ఈఏడాది తక్కువగా నమోదయ్యాయి. ఎయిడ్స్ కేసులు 6464 ఉన్నాయి. 2024 సంవత్సరంలో కుష్టు వ్యాధి కేసులు 283 నమోదు జరిగాయి.
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులకు అన్ని రకాల మందులూ అందుబాటులో ఉండడం లేదు. వైద్యులు బయట షాపుల్లో కొనుక్కోవాలని చీటీలు రాస్తున్నారు. కారణం ఏమిటి?
ప్రభుత్వం 216 హెల్త్ వెల్నెస్ సెంటర్లకు, 104 పిహెచ్‌సిలకు, జిల్లా ఆసుపత్రికి 478 రకాల మందులు అందిస్తున్నారు. మందుల కొరత లేదు. డాక్టర్లు బయట మందులు రాస్తున్నారనేది అవాస్తవం.
ప్రస్తుతం నిర్వహిస్తున్న కుష్టు అవగాహన ర్యాలీలో ఎన్ని బృందాలు పాల్గొంటున్నాయి. ఎంత మంది సిబ్బంది పాల్గొంటున్నారు? కుష్టువ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఎల్‌సిడిసి సర్వేను జిల్లాలో 1790 టీములు ద్వారా నిర్వహిస్తున్నాం. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వరకు అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కో టీమ్‌లు ఆశా కార్యకర్త, ఒక మేల్ అటెండర్‌తో సర్వే నిర్వహిస్తున్నాం.
జిల్లాలో తరచూ డయేరియా ప్రబలుతుంది. కారణాలేమిటి?
నివారణకు తీసుకుంటున్న ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం జిల్లాలో డయేరియా కేసులు లేవు. అపరిశుభ్రతే డయేరియా ప్రబలడానికి ముఖ్యకారణం. ప్రజలంతా పరిశుభ్రత పాటించాలి. ఇంటింటి సర్వే ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాం.