ఉపాధ్యాయులపై ఒత్తిడి తగదు

ప్రజాశక్తి – రాయచోటి ఉపాధ్యాయులపై నిరంతరం ఒత్తిడి పెంచి విద్యాశాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.హరిప్రసాద్‌ ఎస్‌.జాబీర్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కె.సుబ్రమణ్యంను యుటిఎఫ్‌ అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా పలు విద్యా రంగం, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ, విద్యా రంగం సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. స్కూల్‌ గ్రాంట్లు వెంటనే పాఠశాలల పిఎఫ్‌ఎం ఖాతాలకు జమ చేయాలన్నారు. 2023 సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం నిధులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఇంతవరకు చెల్లించలేదని చెప్పారు. 2024లో ఆంగ్లం, ఫిజికల్‌ సైన్స్‌, బయాలజీ ఉపాధ్యాయులకు డిఎ చెల్లింపు చేయలేదన్నారు. జిల్లాలో పని సర్దుబాటు ప్రక్రియ వల్ల జరిగిన అసంబధ్ధాలు సవరించాలని తెలిపారు. 2022-24 సంవత్సరాలలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు విధులు నిర్వ హించిన ప్రధానోపాధ్యాయులకు, స్కూల్‌ అసిస్టెంట్‌లకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలన్నారు. 2024 మేలో సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని కోరారు. చిట్వేలు మండలంలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని చెప్పారు. చిట్వేలు మండలంలో ఉన్న 58 ప్రాధమిక పాఠశాలల్లో 40 పాఠశాలల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా, 7 పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేకుండా ఉన్నాయని వాపోయారు. ముఖ్యంగా రాజంపేట ప్రాంతంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని చెప్పారు. పెనగలూరు, చిట్వేలు మండలాల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేడని వాపోయారు. పిజిటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్‌, ప్రింటర్‌ వంటి పరికరాలు ఇవ్వనప్పటికీ అపార్‌ ఐడి తయారీ తదితర ఆన్‌లైన్‌ పనులు పేరుతో వారిని ఒత్తిడికి గురిచేయడం తగదన్నారు. కార్యక్రమంలో యుటియఫ్‌ జిల్లా కోశాధికారి బి. చంద్రశేఖర్‌, జిల్లా కార్యదర్శులు భాస్కర్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, పురం వెంకట రమణ, రాష్ట్ర కౌన్సిలర్‌ టి.శివారెడ్డి, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సురేంద్ర రెడ్డి, నాయకులు వెంకటయ్య, చిన్నరెడ్డప్ప,లక్ష్మీ రమణ, రాజు, వెంకట రమణ, నాగార్జున, శశి కిరణ్‌, నరసింహా రెడ్డి, అమీన్‌ పాల్గొన్నారు.

➡️