– దశాబ్ద కాలంగా వృద్ధికి నోచుకోని కాలనీ
ప్రజాశక్తి – ఆదోని : రోడ్లు, డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో చిన్నపాటి వర్షం వచ్చిన బురద మయంగా మారుతుందని, తాము ఇళ్లల్లో ఎలా ఉండేది అంటూ కాలనీ మహిళలు సమస్యలు ఎమ్మెల్యే పార్థసారధికి ఏకరువు పెట్టారు. బుధవారం పట్టణ శివారులోని సాయి నగర్ లో ఆధ్యాత్మికత కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి హాజరయ్యారు. కాలనీ ఏర్పడి దశాబ్ద కాలం అయినప్పటికీ డ్రైనేజీ, రోడ్లు సదుపాయం లేదన్నారు. వీధిలైట్లు సదుపాయం లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో కారు చీకట్లోనే మగ్గిపోతున్నామని కాలనీ మహిళలు వీరమ్మ, లక్ష్మి ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. శివారు ప్రాంతంలో ఉండడం వల్ల అధికారులు ఎవరూ తమ వైపు కన్నెత్తి చూడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చీకటి కారణంగా విష పురుగులు సంచరిస్తున్నాయని, దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే ముందు వాపోయారు. ఇంటింటికి కొళాయి లేదని వీధి కుళాయి ద్వారానే త్రాగునీరు తెచ్చుకుంటున్నామని వారు తెలిపారు. కాలనీలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ ఏర్పాటు చేయించి కంపచెట్లు తొలగించి కాలనీ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు
దీనికి స్పందించిన ఎమ్మెల్యే సాయి నగర్ కాలనీ లో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పర్యవేక్షించి అక్కడ నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి తీగలు లాగే లైట్లు ఏర్పాటు చేయాలని అక్కడికక్కడే ఎలక్ట్రిక్ డి ఈ కీ ఫోన్ ద్వారా ఆదేశించారు. రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటుకు ప్రతిపాదనను సిద్ధం చేయాలని మునిసిపల్ కమీషనర్ కృష్ణ కు ఫోన్ లో తెలిపారు.