ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ కార్మికుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ, యాజమాన్యాల వైఖరి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్ హెచ్చరించారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు శనివారం నాటికి 1325వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) నాయకులు, కార్మికులు కూర్చున్నారు. దీక్షనుద్దేశించి అయోధ్యరామ్ మాట్లాడుతూ, ఒక పక్క ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామని చెబుతూనే ప్రయివేటీకరణను వెనక్కు తీసుకోలేదని కేంద్రమంత్రి చెప్పడాన్ని తీవ్రంగా విమర్శించారు. యాజమాన్యం, ప్రభుత్వ ఆదేశాలతో ప్లాంట్‌లో మానవ వనరులను తగ్గిస్తూ చర్యలు చేపట్టిందన్నారు. దీనిలో పూర్తిస్థాయి ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులను అందించకుండా, కార్మికులను దోషులుగా చిత్రీకరించే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఐక్య ఉద్యమాలతో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. యూనియన్ ఉపాధ్యక్షులు కె.గంగాధర్ మాట్లాడుతూ, సెయిల్‌లో అధికారులు, కార్మికులు 54 వేల మంది ఉన్నారని, ఉత్పత్తి 20 మిలియన్ టన్నులు చేస్తున్నారని తెలిపారు. అంటే ఒక మిలియన్ టన్నుకు 2750 ఉన్నారని పేర్కొన్నారు. అదే పద్ధతిలో విశాఖ ఉక్కు కర్మాగారంలో 12,292 మంది 7.3 మిలియన్ టన్నుల స్టీల్ ఎలా ఉత్పత్తి చేస్తారని ప్రశ్నించారు. యాజమాన్యం తప్పుడు లెక్కలతో కార్మికులపై చేస్తున్న దాడిని తక్షణం విరమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి, నాయకులు ఎన్ రామారావు, పుల్లారావు, మరిడయ్య, వి.ప్రసాద్, పట్టా రమేష్, మొహిద్దిన్, అప్పలరాజు, దేముడునాయుడు, కె.బాలశౌరి, డిఎస్‌విఎస్.శ్రీనివాస్, కెఆర్‌కె రాజు, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
