ప్రజాశక్తి-కాశినాయన జ్యోతి క్షేత్రంలో ఎలాంటి కూల్చివేతలు లేకుండా చూస్తానని, నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం ఆయన జ్యోతి క్షేత్రాన్ని సందర్శించి అక్కడ ఇటీవల అటవీశాఖ అధికారులు కూల్చిన భవనాలను పరిశీలించారు. జ్యోతి క్షేత్రమంతా కలియ తిరిగారు. అటవీ శాఖ అధికారులు కూల్చిన భవనాలు పరిశీలించారు. అన్నదాన కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారని, ఆర్థిక సాయం ఎలా వస్తుందని ఆలయ పూజారి జీరయ్యను అడిగి తెలుసుకున్నారు. నరసింహస్వామి టెంపుల్‌ను చూసి అక్కడి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు . ఇక నుండి జ్యోతి క్షేత్రానికి న్యాయమే జరుగుతుందని చెప్పారు. ఢిల్లీలో కాశీనాయన జ్యోతి క్షేత్రం గురించి చర్చ జరిగిందని, అక్కడ కూడా సానుకూల స్పందని వచ్చిందని తెలిపారు. బస్సు యథావిధిగా కొనసాగుతుందని, ఇక నుంచి ఇబ్బందులు ఉండకపోవచ్చు అని అన్నారు ఆయన వెంట బద్వేల్ ఆర్‌డిఒ చంద్రమోహన్ తహశీల్దార్ వెంకటసుబ్బయ్య, ఆర్‌ఐ, పోరుమామిళ్ల సిఐ శ్రీనివాసులు, పోలీసులు ఉన్నారు. భవనాలను కూల్చడం బాధాకరం : ఎంపీ మండల పరిధిలోని కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఉన్న భవనాలను అటవీశాఖ అధికారులు కూల్చివేయడం చాలా బాధాకరమని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులు భవనాలను కూల్చి వేస్తున్న విషయం తెలుసుకున్న ఎంపీ గురువారం కాశీనాయన జ్యోతి క్షేత్రాన్ని సందర్శించారు. కూల్చివేసిన భవనాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జ్యోతి క్షేత్రంలో జరుగుతున్న కూల్చివేతలు తమకు తెలియదని, అటవీశాఖ అధికారులే చేశారని కూటమి పెద్దలు చెప్పడం విడ్డూరమని వాపోయారు. గత సంవత్సరం డిసెంబర్, ఈ సంవత్సరం జనవరిలలో ప్రత్యేక సిఎస్ ద్వారా కడప కలెక్టర్‌కు జ్యోతి క్షేత్రంలో అక్రమ కట్టడాలున్నాయని, వాటిని తొలగించాలని జీవో జారీ చేసింది ప్రభుత్వం కాదా అని పేర్కొన్నారు. కలెక్టర్ మళ్లీ అటవీశాఖ రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అధికారులకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి కాసినాయన జ్యోతి క్షేత్రంలో అక్రమ కట్టడాలున్నాయని, వాటిని కూల దోయమని చెప్పటం నిజం కదా అని ఆయన ప్రశ్నించారు. కూటమి పెద్దలు ఆలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి తెచ్చి ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని వారు కోరారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆలయం నిర్మాణం కోసం 9, దారికి మరో మూడు హెకార్టులకు అనుమతి కావాలని ఢిల్లీ వరకు వెళ్ళామని పేర్కొన్నారు. అక్కడ ఫైలు ఉందని తమ ప్రయత్నం పూర్తిగా చేశామన్నారు. ఇప్పటికైనా కూటమి పెద్దలు కాశి నాయన భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఆలయం నిర్మాణానికి అనుమతులు తేవాలన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ డి.సి గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణారెడ్డి ఉన్నారు.
