ఆడుకుంటామని వచ్చి.. చావు నోటికి చిక్కి

Oct 28,2024 01:00

హేమంత్‌కుమార్‌ దుర్గాప్రసాద్‌ మృతదేహాలు
ప్రజాశక్తి-తాడేపల్లి :
ఆడుకోవడానికి వెళ్తున్నామని చెప్పి ఇంటి నుండి వచ్చిన యువకులు ఎంతసేపటికీ రాకపోవడం, ఆపైన వారి మరణ వార్త తెలియడంతో రెండు కుటుంబాలు తల్లడిల్లాయి. తాడేపల్లిలోని కృష్ణానది పుష్కరఘాట్‌ల వద్ద నీటిలో మునిగి ఇద్దరు యువకులు మృత్యువాత పడిన ఘటనా ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు, మృతుల బంధువుల కథనం ప్రకారం.. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేట, అరుణోదయ కాలనీకి చెందిన ఐదుగురు యువకులు ఆదివారం సెలవుల కావడంతో ఆడుకోవడానికి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి కృష్ణానదికి వచ్చారు. రైలు బ్రిడ్జి సమీపంలో పుష్కర ఘాట్‌ల స్నేహితులంతా స్నానం చేస్తుండగా సుడిగుండాల కారణంగా చివుకు హేమంత్‌ కుమార్‌ (17), గుడివాడ దుర్గాప్రసాద్‌ (23) మునిగిపోయారు. ఇది గమనించిన మిగతా స్నేహితులు పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు వచ్చి వారిని వెలుపలికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. మత్స్యకారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇది తెలిసిన మృతుల కుటుంబీకులు, బంధువులు బోరున విలపిస్తూ ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడు హేమంత్‌ విజయవాడలోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఇంటర్‌ (బైపిసి) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్నాడు. తల్లి, సోదరి ఉన్నారు. మరో మృతుడు దుర్గాప్రసాద్‌ వికలాంగుడు కాగా తండ్రి ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌. దుర్గాప్రసాద్‌ కూడా అదేపని నేర్చుకుంటున్నాడు. తల్లి, సోదరి ఉన్నారు. ఈ రెండు కుటుంబాల్లోనూ మృతులే ఒక్కగానొక్క కుమారులు కావడం గమనార్హం.

➡️