ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో సమానంగా ఇంజినీరింగ్, నాన్ పిహెచ్ కార్మికులందరికీ బేసిక్ వేతనం రూ.21వేలు అమలు చేయాలని, హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు ఎ .జగన్ మోహన్ రావు మాట్లాడుతూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని అన్నారు. విజయనగరం కార్పొరేషన్‌లో పారిశుధ్య కార్మికులకు 3నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలు ఉన్నాయని, పంప్ హౌస్, లీకులు, వాల్ ఆపరేటర్లు, ప్లాంటేషన్ తదితర థర్డ్ పార్టీ కార్మికులకు నెల నెల టెండర్ ప్రకారం కాంట్రాక్టర్ చెల్లించడం లేదని తెలిపారు. మున్సిపల్ కార్మికులను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని ,రిటైర్ అయిన మరణించిన వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు బాబురావు, నారాయణ రావు, శ్రీను, అర్జున్, రాఘవ, శంకర్రావు, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.