ప్రజాశక్తి-పిడుగురాళ్ల : సరస్వతి పవర్ ప్లాంట్ కోరకు భూములిచ్చి మోసపోయిన రైతులకు అండగా ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలోని సరస్వతి పవర్ ప్లాంట్ భూములను పవన్‌కల్యాణ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించి అందులో రైతుల పిల్లలకు ఉద్యోగాలిస్తామని అప్పటి సిఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చెప్పారని, ఆ మొత్తం భూమిలో 86 శాతం మాజీ సిఎం జగన్‌దేనని అన్నారు. ఏళ్లు గడుస్తున్నా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకపోగా ఆ భూములను ఇష్టారీతిని అమ్ముకున్నారని అన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు అప్పటి అసెంబ్లీ ఫర్నిచర్ ప్రభుత్వ కార్యాలయంలో పెట్టేందుకు వీల్లేక బంధువుల ఇంట్లో ఉంచగా దాన్ని దొంగతనంగా సృష్టించి, ఆత్మహత్య చేసుకునేలా మనోవేధనకు గురిచేశారని అన్నారు. మరి వందల ఎకరాలను దోచుకుని అన్యక్రాంతం చేసిన జగన్ ఏమవుతారని ప్రశ్నించారు. సరస్వతి పవర్ ప్లాంట్ కోసం వేమవరంలో 710 ఎకరాలు, చెన్నాయపాలెంలో 273 ఎకరాలు, పిన్నెలిలో 93.7 ఎకరాలు, తంగెడలో 107 ఎకరాలు ఇలా మెత్తంగా 1184 ఎకరాలు, చుక్కల భూమి కింద 77 ఎకరాలు ఉన్నాయన్నారు. 24 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి వేమవరానికి చెందిన ఎస్సీల దగ్గర నుండి లాక్కున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతంలోని యువతను భయాందోళనకు గురిచేసిందని, ఇప్పుడు పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. వారింకా అధికారంలో ఉన్నట్లు వైసిపి నాయకులు అనుకుంటున్నారని, ప్రజలను ఇబ్బందులు పెడితో చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు, వారి కుటుంబ సభ్యులకు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పి చౌకగా భూములు కొనుగోలు చేసి ఫ్యాక్టరీ నిర్మించకుండా రూ.కోట్ల రూపాయలకు ఆ భూములు తాకుట్టు పెట్టుకున్నారని విమర్శించారు. రైతులకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా 550 ఎకరాల్లో మైనింగ్ లీజు అనుమతులు తీసుకున్నారని అన్నారు. భూములు తీసుకుని ఫ్యాక్టరీ నిర్మాణం చేపటడంలేదని రైతులు ప్రశ్నిస్తే నాటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఈ ప్రాంతంలో బాంబులు, మారుణాధాయులతో వీరంగా చేశారన్నారు. ఆ సమయంలో రైతులకు అండంగా ఉన్నందుకు వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నాపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. సరస్వతి ప్యాక్టరీ భూముల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయని, ఫ్యాక్టరీ నిర్మించకపోతే ఆ భూములను ప్రజలకు ఇవ్వాలని, లేకపోతే త్వరగా ఫ్యాక్టరీ నిర్మించి బాధిత రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్‌పి కె.శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్, ఆర్‌డిఒ మురళీకృష్ణ, డిఎఫ్‌ఒ కృష్ణప్రియ, ఇతర అధికారులు పాల్గొన్నారు.