ఉదయం 7.40 గంటలకు చిలకలూరిపేట నరసరావుపేట రహదారిలో మంచు
ప్రజాశక్తి-చిలకలూరిపేట : దట్టంగా కురుస్తున్న మంచుతో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. 20 రోజులుగా చలితీవ్రత పెరగడంతోపాటు మంచు తీవ్రతా ఎక్కువవుతోంది. ఈ క్రమంలో గత నెలరోజుల్లో పట్టణ పరిసరాల్లో రోడ్డు ప్రమాదాలు వాటిల్లి నలుగురైదుగురు మృతి చెందారు. ప్రమాదాలకు మంచే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సాయంత్రం 5.30 గంటలకల్లా చీకటి పడుతుందడగా ఉదయం 8 గంటల వరకూ మంచు ఉండడంతోపాటు చలిగాలులూ వీస్తున్నాయి. మంచు వల్ల రహదారిపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం ఒకెత్తయితే వాకర్లకూ ప్రమాద భయం పట్టుకుంది. ఈ నెలాఖరు వరకూ ఇదే పరిస్థితి తప్పదని తెలుస్తోంది. మంచు కారణంగా దారి సరిగా కనిపించకపోవడం, ఎత్తు పల్లాలు, మలుపులను వాహనదార్లు గుర్తించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు.దీంతోపాటు వాహనాలను వేగంగా నడపడం, సరైన నిద్ర లేకపోవడం వంటివి ప్రమాదాలకు కారణంగా వాహన తనిఖీ అధికారి కెఎల్.రావు చెబుతున్నారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలు నడపకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. తప్పనిసరిగా ప్రయాణించాల్సి వస్తే నిదానంగా వెళ్లాలంటున్నారు. మంచు సమయాల్లో వాహనదారులు రోడ్డు కనిపించే దూరం 10-15 మీటర్ల మధ్య ఉంటే 35 కిలోమీటర్ల వేగంలో వెళ్లాలని, రహదారి సూచికలు, వైట్ లైన్లను అనుసరించి వాహనాలు నడాపలని, వాహనానికి అమర్చే రెడ్ సిగల్స్, బ్రేక్ సిగల్స్ సరిగా పని చేసేలా చూసుకోవాలని చెబుతున్నారు. హైబీమ్ లైట్స్ ఉపయోగించొద్దని, వాటివల్ల స్పష్టంగా కనిపించదన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు గ ర్తించేలా హెడ్ లైట్స్ ఆన్, ఆఫ్ చేస్తూ డ్రైవింగ్ చేయ్యాలన్నారు. వ్యవసాయ కూలీలను తరలించే వాహనాలు ప్రైవేట్ ట్రావెల్స్, బస్సులకు విధిగా వెనుకా ముందు రేడియం స్టిక్కర్లు అతికించాలన్నారు. మంచు కురిసే సమయంలో రోడ్లు తడిగా ఉండి బ్రేక్ బేసినప్పుడు స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుందని, అతివేగం, హఠాత్తుగా బ్రేకులు వేయడం తగ్గించాలని రూరల్ సిఐ సుబ్బానాయుడు సూచిస్తున్నారు.
