ఇదేందయ్యా ఇది.. నేను చూడలా..!

Jun 9,2024 21:18
ఇదేందయ్యా ఇది.. నేను చూడలా..!

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను కలిసిన ఇరిగేషన్‌ ఎస్‌ఇ
ఇదేందయ్యా ఇది.. నేను చూడలా..!
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి అధికార టిడిపి నేతల ఇళ్లు వద్ద ఆపార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు సందేట్లో సడేమియా అన్నట్లు అధికారులు పడిగాపులు గాస్తున్నారు. ఒకప్పుడు పోలీసు, రెవెన్యూతోపాటు ఇతర అధికారులు నిజాయతీగా విధులు నిర్వహించేవారు. చట్ట ప్రకారం తమ విధులు పూర్తి చేసేవారు. ఇటీవల కాలంలో అటు వైసిపి, ఇటు టిడిపి పాలనలో ఏ పార్టీ అధికారంలో ఉంటే పార్టీ విధానాలు అమలు చేయడంతోపాటు, మంత్రులు, ఎంఎల్‌ఎ, నేతలు చెప్పినట్లు వినడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే సమయంలో నాయకులు అడుగులకు మడుగులొత్తితేనే మంచి పోస్టింగ్‌లు ఉంటాయనే భావనతోపాటు, ఆర్థికంగా బలపడానికి ఉన్న అవకాశాలున్న చోట్ల అధికారుల వాలిపోతున్నారు. వైసిపి ప్రభుత్వ కాలంలో పోలీసులు ఇష్టాను సారంగా వ్యవహరించారనే ఆరోప ణలున్నాయి. రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున అప్పటి అదికారపార్టీ నేతలు చెప్పినట్లు చేశారనే పేరుంది. గ్రావెల్‌, ఇసుక, రియల్‌ ఏస్టేట్‌ దందా, నుడా పరిధిలో అక్రమ లేఅవుట్లు, ఇరిగేషన్‌ కాలువలు, భూములు ఆక్రమించుకున్నా పట్టించుకోని అధికారులు, ఇలా అనేక విషయాల్లో కొందరు అధికారులు ఇష్టానుసానంగా వ్యవహరిం చారని టిడిపి నేతలు అప్పట్లో ఆరోపణలు చేశారు, ఇదే సమయంలో ఎక్కడెక్కడ అధికారులు వైసిపి నేతలకు సహకరించారో టిడిపి నేతలు జాబితా సిద్ధం చేశారు. నెల్లూరు నగరం, సర్వేపల్లి, కావలి, నెల్లూరు రూరల్‌, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లో అధికారులు వివిధ శాఖల అధికారులు ఎం ఎల్‌లు, వారి అనుచరులు చెప్పినట్లే చేశారని గతంలో చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు,. ప్రధానంగా కావలి నియోజకవర్గంలో అప్పటి ఎంఎల్‌ఎ రామ్‌రెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సుకుమార్‌రెడ్డి, ఎంఎల్‌ఎ సతీమణి చెప్పినట్లు రెవెన్యూ అధికారులు వ్యవహరించారనే ఆరోపణలు న్నాయి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రతోపాటు ఆపార్టీ నేతలు ఆరోపణలు చేశారు. టిడిపి అధికారంలోకి రావడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు బీద రవిచంద్ర, స్థానిక ఎంఎల్‌ఎ కావ్య కృష్ణారెడ్డి ఇంటిచుట్టూ తిరుగు తున్నారు. బొకేలిచ్చి మచ్చిక చేసుకుంటున్నారు. ఎలాంటి సమయం లోనూ ఆ అధికారులను వదలొద్దని ఆపార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో గత ఐదేళ్ల నుంచి రెవెన్యూ, పోలీసు అదికారులు అప్పటి మంత్రి కాకాణి గొవర్దన్‌రెడ్డి చెప్పినట్లు నడుచుకున్నారని, భూములు ధారాదత్తం చేశారని ఆరోపణలు చేశారు. పొదలకూరు మాజీ తహశీల్దారు స్వాతిని సస్పెండ్‌ చేశారు. ఇంకా ఆనేక మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారని ఆయన కొంత కాలం నుంచి చెబుతున్నారు. ఇప్పుడు చంద్రమోహన్‌రెడ్డి ఎంఎల్‌ఎ కావడంతో ఇక్కడ పనిచేసిన అధికారులను ఏం చేయాలో తెలియని నానా హైరానా పడుతున్నారు. తెలిసిన నేతలను పట్టుకొని ఆయనకు కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోనూ ఎంఎల్‌ఎ శ్రీధర్‌రెడ్డిని కాదని కొందరు వైసిపి నేతలు చెప్పినట్లు నడుచుకున్న అధికారులు ఇప్పుడు శ్రీధర్‌రెడ్డి కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆఫీసుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయగిరి, కోవూరు, ఆత్మకూరు, నియోజ కవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నూతన ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నాల్లో ఎవరి ఉన్నారు. తరువాత అధికారుల బదిలీలు, చర్యలు ఉంటాయనే ప్రచారం సాగుతోంది.” సార్‌ మేం మీ అభిమానులమే ఆ పార్టీ అధికారంలో ఉండడంతో అలా చేయాల్సి వచ్చింది.” క్షమించండి సార్‌ అంటూ ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. అధికారులు నిజాయతీగా పనిచేసిన వారికి ఎలాంటి ఇబ్బంది లేక పోయినా అధికారపార్టీనేతల ఆశీర్వాదం కోసం పనిచేసిన అధికారులు మాత్రం వణుకుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి..

➡️