ఈ రోడ్డు బడిబస్సుకు పనికిరాదట!

Feb 15,2025 21:24

ప్రజాశక్తి-వేపాడ : ఈ చిత్రంలో కనిపిస్తున్న తారురోడ్డు.. వేపాడ మండలంలోని సోంపురం నుంచి జాకేరు మీదుగా బక్కునాయుడుపేటకు వెళ్లే మార్గంలోనిది. ఆరు గ్రామాల మీదుగా వెళ్లే ఈ రహదారిలో నిత్యం పదుల సంఖ్యలో ఆటోలు, లారీలు, ప్రయివేటు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాంటి రోడ్డును ఆర్‌టిసి శృంగవరపుకోట డిపో అధికారులు.. బడిబస్సు నడపడానికి పనికిరాదని తేల్చేశారు. తుప్పలు, డొంకలు తొలగిస్తే తప్ప ఆర్‌టిసి బస్సు నడపలేమని స్పష్టంచేశారు. బక్కునాయుడుపేట వద్దనున్న ఆదర్శ పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు విద్యనభ్యశిస్తున్నారు. విద్యార్థుల కోసం ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు స్పందించి, ఆ మార్గంలో తుప్పలు, డొంకలు తొలగించారు. మరోవైపు బడిబస్సు ఏర్పాటు చేయాలని సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్‌, కలెక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌… ఆర్‌టిసి అధికారులను ఆదేశి ంచారు. అయినా శృంగవరపుకోట డిపో అధికా రులు అవేవీ ఖాతరు చేయలేదు. మొండిపట్టు వీడలేదు. చివరికి, డిపో అధికారుల పుణ్యమా! అని ఆదర్శ పాఠశాల విద్యార్థులు నానా వ్యయ ప్రయాసలకోర్చి ప్రయివేటు వాహనాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో సమయానికి పాఠశాలకు చేరుకోలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో మరో రెండు వారాల్లో ఇంటర్‌ పరీక్షలు, నెల రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బడిబస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

➡️